Konathala Rama Krishna: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు, వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మాజీ అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో యాక్టివ్ గా పని చేశారు. కానీ తరువాత జగన్ కు దూరమయ్యారు. అటువంటి నేత ఇప్పుడు జనసేనలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం.
కొణతాల రామకృష్ణ ది కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ చరిత్ర. అయితే ఆయనను గుర్తించింది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటంతో కొణతాలకు గుర్తింపు లభించింది. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1989లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1996 వరకు ఎంపీగా ఉన్నారు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో గుర్తింపు పొందారు. 2004లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో కీలక వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, న్యాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే రాజశేఖర్ రెడ్డి మరణంతో కొణతాల రామకృష్ణ రాజకీయంగా దెబ్బ తిన్నారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట నడిచిన తొలి తరం నాయకుడు కూడా కొణతాలే. వైసిపి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా కూడా ఎంపికయ్యారు.2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు జగన్ ను ఒప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయారు. దీంతో అప్పటినుంచి జగన్ కొణతాలను పక్కన పడేశారు. 2014 ఎన్నికల తరువాత కొణతాల రామకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో జనసేన లో చేరాలని నిర్ణయించుకున్నారు.
వాస్తవానికి కొణతాల రామకృష్ణ టిడిపిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ తన చిరకాల ప్రత్యర్థిగా ఉన్న దాడి వీరభద్రరావు టిడిపిలో చేరడంతో కొణతాల పునరాలోచనలో పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరడం.. ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించడంతో కొణతాల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కెవిపి రామచంద్రరావు కీలక చర్చలు జరిపారని టాక్ నడిచింది. కానీ కొణతాల జనసేన వైపు మొగ్గు చూపడం విశేషం. ఆయన అనకాపల్లి ఎంపీ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు ఆ సీటు దక్కితే తప్పకుండా కొణతాలకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. కొణతాల చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయంగా తేలుతోంది.