Former Union Minister Pallam Raju: కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందా? వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని రంగంలో దించాలని ప్రయత్నిస్తుందా? తద్వారా పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోందా? అటు టీడీపీ సైతం ఎవరికీ టిక్కెట్ హామీ ఇవ్వకుండా దాటవేత ధోరణికి కారణం అదేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు జిల్లాలపై పవన్ ఫోకస్ పెంచారు. అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను దింపాలని చూస్తున్నారు. అదే సమయంలో ఎంపీ అభ్యర్థులుగా సీనియర్లను రంగంలో దింపితే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా తటస్థులు, వివిధ పార్టీల్లో స్థాయి కలిగిన నాయకులను రప్పించి టిక్కెట్లు కట్టబెడతారన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరీ ముఖ్యంగా కాకినాడ ఎంపీ స్థానాన్ని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు కేటాయిస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

అటు టీడీపీలో కూడా కాకినాడ ఎంపీ సీటుకు డిమాండ్ ఉంది. చాలామంది ఔత్సాహికులు పోటీచేసేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో యువ నాయకుడు జ్యోతుల నవీన్ ముందున్నారు. తనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తే గెలుచుకొని వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎదుట కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు వంతున రూ.35 కోట్లు ఖర్చుచేయ్యాల్సి ఉంటుందని లెక్క చెప్పినట్టు సమాచారం. అయితే దీనిపై జ్యోతుల నవీన్ తాను అంత ఖర్చు పెట్టలేనని చెప్పినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ కుమారుడే ఈ నవీన్. ప్రస్తుతానికైతే చంద్రబాబు నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. జనసేనతో పొత్తు కొలిక్కి వచ్చాకే మాట్లాడతామని చెప్పినట్టు సమాచారం.

కాకినాడ ఎంపీ సీటును జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని నిర్ణయించింది. అందుకే రాజకీయాల్లో ప్లెయిన్ ఇమేజ్ ను కొనసాగిస్తూ వస్తున్న పల్లంరాజును జనసేనలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని పవన్ యోచిస్తున్నారు. అందుకు తగ్గట్టు పావులు కదుపుతున్నారు. త్వరలో పల్లంరాజు జనసేనలో చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఉన్నారు. ఆమెకు మరోసారి చాన్స్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చలమశెట్టి సునీల్ అభ్యర్థిత్వాన్ని జగన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గీత కంటే సునీల్ వైపే మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసే పల్లం రాజు విజయం నల్లేరు మీద నడకేనని రెండు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో మంచి ముహూర్తంలో పల్లంరాజు జనసేనలో అడుగు పెట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థిని ఫిక్స్ చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం.