Ravi Prakash- Ambani Telugu Channels: ప్రముఖ తెలుగు టెలివిజన్ న్యూస్ ఛానెల్ టీవీ9 వ్యవస్థాపకుడు- వివాదాస్పద మీడియా జర్నలిస్ట్ రవి ప్రకాష్ చివరకు అంబానీల పంచన చేరడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. టీవీ9 నుంచి వెలివేయబడ్డ తర్వాత నిద్రాణస్థితిలో ఉన్న రవిప్రకాష్ మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అప్పట్లో బీజేపీ పెద్దలను కలిసి వారి కోసం ఓ చానెల్ పెడుతానని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ అందుకే వారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రవిప్రకాష్ మిన్నకుండిపోయారని తెలిసింది. ఆ తర్వాత రాజ్ న్యూస్ బాధ్యతలు తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో పైకి రావాలని చూశారని.. అది సాధ్యం కాలేదని తెలిసింది. ఈ క్రమంలోనే అతి త్వరలో న్యూస్ చానెల్స్ రంగంలోకి పునరాగమనం చేయబోతున్నారు.
వార్తల వెబ్‌సైట్స్, కొన్ని న్యూస్ ఛానెల్‌లను నడపడంలో తెరవెనుక పాత్ర పోషిస్తున్న రవి ప్రకాష్, తెలుగులో టెలివిజన్ ఛానెల్‌ని ప్రారంభించాలని అంబానీలకు సూచించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి అంబానీ గ్రూప్ కూడా సరేనన్నది టాక్. “సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకటి లేదా రెండు నెలల్లో కొత్త ఛానెల్ పెద్ద ఎత్తున ప్రారంభించబడుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణికి ధీటుగా ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా వెళుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు”అని కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి.
Also Read: Governor Tamilisai -KCR: కేసీఆర్ పై మళ్లీ బరెస్ట్ అయిన తమిళిసై
ప్రస్తుతం టీఆర్‌ఎస్ వ్యతిరేక స్టాండ్‌గా పేరుగాంచిన ప్రస్తుత తెలుగు వెబ్‌సైట్‌ను కూడా ఈ బృందం పూర్తిస్థాయి వార్తాపత్రికగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా అతి త్వరలో రూపుదిద్దుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త మీడియా హౌస్ సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుందని.. మీడియా కవరేజీలో కొత్త ట్రెండ్‌ను ప్రవేశపెడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. “ఇది జర్నలిజం పట్ల కొత్త విధానాన్ని కలిగి ఉంటుంది. మీడియాలో తాజా ఆవిష్కరణలను పురుడు పోసేలా తీర్చిదిద్దుతున్నారు” అని వర్గాలు తెలిపాయి.
కొన్ని సంవత్సరాల క్రితం టీవీ9 ప్రమోటర్ అయిన అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ABCL) నుంచి అనాలోచితంగా తొలగించబడిన తరువాత.. కొత్త మేనేజ్‌మెంట్‌పై రవిప్రకాష్ న్యాయ పోరాటం చేశాడు. టీవీ9 నుంచి అక్రమంగా తొలగించారని కోర్టుల్లో పోరాడారు. కానీ అవేవీ ఫలించలేదు.
తరువాత రవిప్రకాష్ ఫోర్జరీ, మోసం ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు. తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి బెయిల్‌పై ఉన్న ఆయన కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది జూన్ లో కొత్త ప్రమోటర్లు టీవీ9ని టేకోవర్ చేయడం పూర్తిగా చట్టబద్ధమైనదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీర్పునిచ్చింది. జూపల్లి జగపతి రావు మరియు ఇతర డైరెక్టర్లతో సహా కొత్త ప్రమోటర్లకు ఇబ్బందులు సృష్టించినందుకు రవి ప్రకాష్‌ను తప్పుపట్టింది. రవిప్రకాష్ మరియు అతని సహచరుడు కెవిఎన్ మూర్తి ప్రతివాదులకు పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో టీవీ9 మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రవి ప్రకాష్ ఓడిపోయారు. అప్పటి నుంచి కొత్త ఛానెల్ ప్రారంభించేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు.కానీ ఇతడు గతంలో టీవీ9ను చేతిలో పెట్టుకొని ఏపీ రాజకీయాలను శాసించిన తీరు.. అప్పట్లో బీజేపీని కూడా టార్గెట్ చేయడంతో కమలనాథులు దక్కరకు రానీయలేదని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడు దేశంలోనే అపర కుబేరులు అయిన అంబానీలను కాకపట్టి వారి ద్వారా తెలుగులో న్యూస్ ఛానెల్ పెట్టించి దాని నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తీసుకోవాలని రవిప్రకాష్ స్కెచ్ గీసినట్టు తెలిసింది. దీనికి అంబానీలో మొగ్గు చూపడంతో వచ్చే ఎన్నికల లోపు కొత్త ఛానెల్ తెలుగులో రవిప్రకాష్ సారథ్యంలో రానుందని తెలుస్తోంది.