https://oktelugu.com/

సచిన్ పైలట్ తిరిగి రాక దేనికి సంకేతం?

దేశవ్యాప్తంగా సచిన్ పైలట్ తిరుగుబాటు కాంగ్రెస్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సచిన్ పైలట్ తిరుగుబాటు పై ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని దిగజారిపోతున్న పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడటం జరిగింది. ఈ నేపధ్యంలోనే సంజయ్ ఝా లాంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధుల్ని సాగనంపటం కూడా జరిగింది. అదేసమయంలో ఎవరూ ధైర్యంగా ముందుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించినది లేదు. త్వరలో రాహుల్ గాంధీ అధ్యక్షపదవి చేపట్టాలనే ప్రకటనలు […]

Written By:
  • Ram
  • , Updated On : August 11, 2020 5:33 am
    Follow us on

    దేశవ్యాప్తంగా సచిన్ పైలట్ తిరుగుబాటు కాంగ్రెస్ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు సచిన్ పైలట్ తిరుగుబాటు పై ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని దిగజారిపోతున్న పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడటం జరిగింది. ఈ నేపధ్యంలోనే సంజయ్ ఝా లాంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధుల్ని సాగనంపటం కూడా జరిగింది. అదేసమయంలో ఎవరూ ధైర్యంగా ముందుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించినది లేదు. త్వరలో రాహుల్ గాంధీ అధ్యక్షపదవి చేపట్టాలనే ప్రకటనలు ఇచ్చారు. కానీ లోలోపల అసంతృప్తి వ్యక్తపరుస్తూనే వున్నారు. ఇది ఓ టిపికల్ కాంగ్రెస్ నాయకుల మనస్తత్వం. అందరూ సచిన్ పైలట్ తిరుగుబాటు ఎలా మారుతుందని ఆసక్తిగా ఎదురు చూసారు. చివరకు కధ సుఖాంతమయ్యింది.

    అయోమయం లో కాంగ్రెస్ 

    కాంగ్రెస్ కి ఒక దశ దిశా లేకుండా అయిపోయింది. ఎవరి ఇష్టం వారిది. కొంతమంది రామమందిర నిర్మాణంపై మద్దత్తుగా మాట్లాడుతుంటే మరికొందరు ఇప్పటికీ అది తప్పనే మాట్లాడుతున్నారు. చివరకు ప్రియాంక గాంధీ సానుకూలంగా ట్వీట్ చేయటం కొంతమేర సద్దుమనిగిందని అనుకుంటే కేరళ లో ముస్లిం లీగ్ అసంతృప్తి వ్యక్తంచేసింది. మారిన సామాజిక పరిస్థితుల్లో హిందూ అనుకూల వైఖరి తీసుకోకపోతే హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడే అవకాశముంది. కానీ అదేసమయంలో ముస్లిం ప్రజల్లో అనుమాన బీజాలు మొలకెత్తే అవకాశముంది. సమాజం అంతగా సమీకరించబడిందనేది అందరూ అంగీకరించే అంశం. దానికి కూడా కాంగ్రెస్ అవకాశవాద సెక్యులర్ విధానాలే కారణం. బిజెపి బలపడిందాంట్లో కాంగ్రెస్ పాత్ర చాలా వుంది.

    ఇదే అయోమయం నిర్మాణ సమస్యల్లోనూ వుంది. రాహుల్ గాంధీ అధ్యక్షుడైన తర్వాత యువకులకు పార్టీలో పెద్ద పీట వేయాలని భావించాడని వార్తలు వచ్చాయి. వెంటనే కురు వృద్ధులు అందరూ సోనియా గాంధీ పంచన చేరి మొరపెట్టుకోవటంతో మళ్ళీ పరిస్థితులు మొదటకే వచ్చాయి. రాహుల్ గాంధీ రాజీనామా తో సీనియర్లకు తిరిగి మహర్దశ వచ్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్ గడ్ ల్లో ప్రజలు కాంగ్రెస్ ని గెలిపిస్తే రాజస్తాన్, మధ్యప్రదేశ్ లలో తిరిగి పాతతరాన్ని నెత్తిన పెట్టుకున్నారు. దానితో పాత కొత్త తరాల అంతర్యుద్ధం పెరిగి పెద్దదయ్యింది. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా బయటకు వెళ్ళిన తర్వాత కూడా మార్పు దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చివరకు అది రాజస్తాన్ సంక్షోభానికి దారి తీసింది.

    కధ సుఖాంతమైనా శేష ప్రశ్నలు మిగిలే వున్నాయి 

    ముందుగా కాంగ్రెస్ పార్టీ బిజెపి పై చేసిన ఆరోపణలు ఏమయ్యాయో చెప్పాల్సివుంది. ఇదంతా బిజెపి కుట్రలో భాగమేనని ప్రజల్ని నమ్మించటానికి ప్రయత్నించింది. కొంతమేరకు ప్రజలు కూడా మధ్యప్రదేశ్ ఉదంతం తో ఈ ఆరోపణలు నిజమేనని నమ్మారు. సచిన్ పైలట్ నేను బిజెపి లో చేరను అని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ ఆరోపణలని వెనక్కు తీసుకోలేదు. అశోక్ గెహ్లాట్ అయితే ఇంకో అడుగు ముందుకేసి వ్యక్తిగతంగా బాణాలు ఎక్కుపెట్టాడు. మరి ఇప్పుడు ఈ ఆరోపణలు ఏమైనట్లు? అంటే బిజెపి తో ‘కుమ్మక్కైన’ సచిన్ పైలట్ ని తిరిగి వెనక్కు తీసుకొని పదవులు అప్పచెబుతారా? వేల కోట్ల రూపాయలు చేతులు మారాయయని చేసిన ఆరోపణలు ఏమైనట్లు? నిజంగా అన్ని డబ్బులు తీసుకొని కుట్రకు సహకరించి వుంటే తిరిగి స్వంత గూటికి ఎందుకొచ్చారు? డబ్బులుతీసుకొని పార్టీ మారే అలవాటు వున్న వాళ్ళు తిరిగి రావాలన్నా అంతకన్నా ఎక్కువ డబ్బులు ముట్టినప్పుడే వస్తారు కదా? సచిన్ పైలట్ ఈ కుట్రకు సూత్రధారి అయినప్పుడు ఈ ‘అవినీతి’ అంతా తనే చేసినట్లు కదా? ముడుపులు తీసుకున్నారని పెట్టిన కేసులు ఎందుకు విరమించుకున్నారు? అంటే ఇదంతా అశోక్ గెహ్లాట్ సృష్టించిన కట్టు కధేనా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై , రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై వుంది. ఈ ప్రశ్నలు శేష ప్రశ్నలుగా మిగిలిపోతే ప్రజలు కోర్టు కెళ్ళి వీటికి జవాబులు రాబట్టాల్సిన అవసరం వుంది.

    సచిన్ పైలట్ భవిష్యత్తు నిరాశాజనకమేనా?

    సచిన్ పైలట్ కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగరవేసి ఎంతోమంది కాంగ్రెస్ అభిమానుల్లో  ఆశలు చిగురించాడు. గాంధీ కుటుంబంతో బ్రష్టు పట్టి పోయిన కాంగ్రెస్ ప్రతిష్టను ఇంకో రూపంలో సచిన్ పైలట్ నిలబెడతాడని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది. ఈ రోజుకి పాత కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన కాంగ్రెస్ శ్రేయోభిలాషులు దేశంలో ఎంతోమంది వున్నారు. బిజెపి కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని తీర్చిదిద్దాలని వువ్విల్లూరిన ఎంతోమందికి ఇది నిరాశే. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ చివరికి గాంధీ కుటుంబం చేతిలో బందీ అవటం దురదృష్టం. నెహ్రు-ఇందిరా గాంధీ ల  మీద గౌరవం వుండటం వేరు, కాంగ్రెస్ ని బతికించు కోవటం వేరు. 21వ శతాబ్దపు తరం వారసత్వ రాజకీయాల పై నమ్మకంలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం పై పార్టీని నడినప్పుడే పార్టీ వైపు యువత ఆకర్షించబడతారు. ముఖ్యంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆర్ధిక అవినీతి ఆరోపణలని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణం లో కూడా ఇటలీ ఖత్రోచీదే ప్రధాన పాత్ర. దొంగచాటుగా తనని దేశం దాటవేయటం తో గాంధీ కుటుంబం ప్రతిష్ట మసకబారింది. సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసు తో వీరి అవినీతి దేశం మొత్తానికి పూర్తిగా బట్టబయలయింది . కొన్నాళ్ళు ఈ కుటుంబం పదవులనుంచి తప్పు కుంటేనే కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతుంది. లేకపోతే మోడీ జగన్నాధ రధ చక్రాల ధాటికి విలవిలా కొట్టుకుంటూనే వుంటుంది. కొత్త తరాన్ని ఆకర్షించాలంటే గాంధీ కుటుంబేతర వ్యక్తి చేతిలో అంతర్గత ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ కి  నూతన జవసత్వాలు కల్పించాలి.

    సచిన్ పైలట్ ఆధ్వర్యం లో ఆ పని జరుగుతుందని చాలామంది ఆశించారు. అయితే శరద్ పవర్, మమతా బెనర్జీ , జగన్ మోహన రెడ్డి లాంటి ఉదంతాలు చూపించి అది సాధ్యం కాదని కొంతమంది గాంధీ కుటుంబ భక్తి బృంద మేధావులు తేల్చేసారు. కానీ వాళ్లకు అర్ధం కానిదేమిటంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఆయా ప్రాంతాల నాయకులే తప్ప దేశవ్యాప్తంగా ప్రభావం చూపించగలిగిన వాళ్ళు కాదు. ఇందుకు కొంతమేర శరద్ పవార్ మినహాయింపుగా మేధావులు అనుకోవచ్చు. ఈదేశంలో హిందీ ప్రాంతానికి చెందినవాడు కాకపోతే ఒక జాతీయ పార్టీని నిర్మించటం సాధ్యం కాదు. బిజెపి ఉదాహరణ ఇక్కడ వర్తించదు. అది హిందుత్వ సిద్ధాంతం తో ఆర్ ఎస్ ఎస్ మద్దత్తు తో పనిచేస్తుందని మరిచిపోవద్దు. అయినా ఈ స్థాయికి రావటానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది. సచిన్ పైలట్ యువకుడు, ముఖ్యంగా హిందీ ప్రాంతానికి చెందినవాడు, కాంగ్రెస్ లో యువ నాయకుల్లో పేరు వున్నవాడు, గత ఆరు సంవత్సరాలు ఒక హిందీ రాష్ట్రం లో పార్టీని    కిందనుంచి ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చినవాడు కావటం తో ఒక ఇమేజ్ పార్టీలో నాయకులతో పాటు ప్రజల్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీని సరైన పంధాలో నడపటానికి ఇంతకన్నా బంగారు అవకాశం ఎప్పుడూ రాదు. అందునా బిజెపి లో చేరను అని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో , ఉదార వాద మేధావుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అదే మాటమీద నిలబడి వుంటే 2024 కి ఒక బలమైన ఉదారవాద పార్టీగా ముందు కొచ్చేది. బిజెపి కి ప్రత్యామ్నాయంగా ఇంకో జాతీయ నాయకుడు ( గాంధీ కుటుంబేతర) తయారయ్యేవాడు. ఇంత మంచి అవకాశం జారవిడుచుకొని సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ లో అందరిలో ఒకడిగా గాంధీ కుటుంబ భక్తి బృందం లో సభ్యుడిగా తిరిగి చేరటం తన రాజకీయ జీవితం లో చేసిన పెద్ద పొరపాటు. అవకాశాలు మనం కావాలనుకున్నప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే  నాయకత్వ లక్షణం. ఐ పిటీ సచిన్ పైలట్.