Former MLA Birudu Rajamallu: మరికొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. రెండు సార్లు అప్రతిహత విజయాలతో అధికారాన్ని దక్కించుకున్న భారత రాష్ట్ర సమితి మూడో సారీ అధికారాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై, స్థానిక నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో గులాబీ బాస్ అనేక ప్రజాకర్షక పథకాలకు తెరదీశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు పచ్చజెండా ఊపారు. రైతుల రుణాల మాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి నిర్ణయాలు పార్టీకి బూస్ట్ ఇవ్వాలి. కానీ ఎందుకనో బూమరాంగ్ అవుతోంది.
ఓడించి తీరుతాం
సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో.. మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇస్తే ఓడించి తీరతామని భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ల తీరుతో తట్టుకోలేని వారంతా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకుని ఈ మేరకు తీర్మానాలు కూడా చేసుకుంటున్నారు. ఇతర సీనియర్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే ల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో ఒక్కరోజే చాలా మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మీద కార్యకర్తలు తిరుగుబాటు ప్రకటించడం విశేషం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాను బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మనోహర్ రెడ్డి ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని రాజమల్లు చెబుతున్నారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక నాయకులు ఏకంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ మునిసిపల్ మాజీ చైర్మన్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ, ఆయనను మార్చకపోతే ఓడిస్తామని కార్యకర్తలు అంటున్నారు. దేవేందర్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీద కూడా ఇలాంటి అసమ్మతి గళాలు వెల్లువెత్తుతున్నాయి. చొప్పదండి పరిధిలో ఉన్న అసంతృప్తనేతలను బుజ్జగించేందుకు మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమావేశాలు నిర్వహించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులతో తమపైనే కేసులు పెడుతున్నారని వారు ఈసందర్భంగా కమలాకర్, వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.
భారతరాష్ట్ర సమితిలో వ్యవహారం కేసీఆర్ కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడది కేటీఆర్ సెంట్రిక్‌గా మారింది. వీరు తీసుకునే నిర్ణయానికి ఎవరూ ఎదురు చెప్పలేరు. చివరికి హరీష్‌రావు కూడా. ఒక్కసారి పార్టీ నిర్ణయం తీసుకుందా అదే ఇక ఫైనల్. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్టు కన్పిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ గతంలో కంటే ఎక్కువ బలంగా కనిపిస్తూ ఉండటంతో బీఆర్‌ఎస్ నాయకులు అటు వైపు చూస్తున్నారు. అధిష్ఠానం మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు నేతలను సర్దుబాటు చేయడం అధిష్ఠానం వల్ల అవుతుందా? జాతీయ పార్టీ అని, దేశంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెబుతున్న కేసీఆర్ దీనిని ఎలా కట్టడి చేస్తారనే దానిపైనే అందరూ ఎదురు చూస్తున్నారు.