Balineni Srinivasa Reddy: బాలినేని.. అప్పుడే మొదలు పెట్టావా..

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు జగన్ స్థానచలనం కల్పించారు. వేరే నియోజకవర్గాలకు పంపించారు. దీంతో బాలినేనిలో ఒక రకమైన అంతర్మధనం ప్రారంభమైంది.

Written By: Dharma, Updated On : December 13, 2023 11:02 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పు నేపథ్యంలో.. తన వరకు ఆ పరిస్థితి రాకూడదని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో తాను మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తానని.. ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి బరిలో దిగుతారని.. మా ఇద్దరిదీ హిట్ కాంబినేషన్ అని తేల్చి చెప్పడం విశేషం. సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని ఈ విషయాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు జగన్ స్థానచలనం కల్పించారు. వేరే నియోజకవర్గాలకు పంపించారు. దీంతో బాలినేనిలో ఒక రకమైన అంతర్మధనం ప్రారంభమైంది. వాస్తవానికి మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత బాలినేని చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇలా వ్యాఖ్యలు చేసే క్రమంలో జగన్ పిలిచి బుజ్జగించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతను వదులుకునేందుకు జగన్ సిద్ధపడటం సాహసమే. ఇటువంటి సమయంలో బాలినేని అయినా జగన్ వెనుకాడబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ నేపథ్యంలో బాలినేని బలప్రదర్శనకు దిగారు. పుట్టినరోజు వేడుకలు అంటూ హంగామా చేశారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలంతా హాజరయ్యారు. దశాబ్ద కాలంలో పుట్టినరోజు వేడుకలను ఏనాడూ బాలినేని చేసుకోలేదు. అదే రోజు తన మాతృమూర్తి చనిపోవడంతో పుట్టినరోజు వేడుకలకు దశాబ్ద కాలంగా బాలినేని దూరమయ్యారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిమాణామాల నేపథ్యంలోనే బాలినేని పుట్టినరోజు వేడుకల్లో బల ప్రదర్శనకు దిగినట్లు తెలుస్తోంది. జగన్ సీరియస్ గా నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. తనపై ఎక్కడ వేటు వేస్తారు అన్న ఆందోళన బాలినేని లో కనిపిస్తోంది. అందుకే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకులను సమీకరించారు. ఇది నా బలం అంటూ హై కమాండ్ కు సంకేతాలు పంపారు.

అయితే ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో కీలక మార్పులు ఉంటాయని బాలినేని ప్రత్యర్థి వై వి సుబ్బారెడ్డి విశాఖలో ప్రకటించారు. ఎంతటి వారైనా త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇది బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించినదేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు తగ్గించి.. బీసీ,ఎస్సీ లకు పెంచాలని జగన్ భావిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలను పక్కనపెట్టి స్పష్టమైన సంకేతాలు పంపారు. బాలినేని సైతం వదులుకోవడానికి సిద్ధపడతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో బాలినేనిలో హైరానా కనిపిస్తోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పుట్టినరోజు వేడుకల పేరిట బల ప్రదర్శనకు దిగినట్లు సమాచారం. కొద్ది రోజుల్లో బాలినేని పొలిటికల్ కెరీర్ పై ఒక స్పష్టత రానుంది.