SM Krishna: కర్ణాటక రాష్ట్రంలో పుట్టిన ఆయన కన్నడ రాజకీయాలలో తనకంటూ సుదీర్ఘమైన చరిత్రను సృష్టించుకున్నారు. హెగ్డేలు ముఖ్యమంత్రులుగా ఏలుతున్న సమయంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని కన్నడ సీమలో ముఖ్యమంత్రిగా ఎదిగారు. అసెంబ్లీ స్పీకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. విదేశాంగ శాఖ మంత్రి వరకు ఎదిగారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.. ఎస్ఎం కృష్ణ 1989-93 కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 1993 -94 కాలంలో కర్ణాటక మొట్టమొదటి ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు. 1999 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2006 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేశారు. 2009 నుంచి 12 వరకు యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.
అనారోగ్య సమస్యలతో
వృద్ధాప్యం వల్ల నెలకొన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎస్ఎం కృష్ణ ను కుటుంబ సభ్యులు ఇటీవల వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఏర్పడటంతో మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనను అత్యవసర విభాగంలో ఉంచి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆయనకు ట్రీట్మెంట్ అందించింది. ఊపిరి తిత్తుల్లో ఇన్ ఫెక్షన్ వల్ల ఆయన శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. ఆ సమస్య తీవ్రతరం కావడంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 1932, మే 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మద్దూరు తాలూకా సోమన హల్లి అనే గ్రామంలో ఎస్ఎం కృష్ణ జన్మించారు. ఎస్ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. కొత్తూరులో ప్రాథమిక విద్యను, మైసూరులోని శ్రీ రామకృష్ణ విద్యాసాలలో సెకండరీ విద్యను, మైసూరులోని మహారాజ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఇదే కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేశారు. డల్లాస్, టెక్సాస్, వాషింగ్టన్ డిసి లోని పలు విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత చదువులు చదివారు.
కాంగ్రెస్ కుర వృద్ధుడు
ఎస్ఎం కృష్ణ కర్ణాటక రాజకీయాలలో కురవృద్ధుడిగా పేరుపొందారు. కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవులు అనుభవించి.. తన వాగ్దాటితో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను నాడు ప్రజలకు చెప్పడంలో ఆయన విజయవంతమయ్యారు. ఆయన చరిష్మా వల్లే కాంగ్రెస్ పార్టీ నాడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని నేటికి చెప్పుకుంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్నప్పటికీ.. ఎస్ఎం కృష్ణ లాంటి గొప్ప నాయకుడు ఆ పార్టీ లో లేడని ఇప్పటికీ కార్యకర్తలు అంటుంటారు. ఆయన మరణం జీర్ణించుకోలేనిదని.. ఆయన చేసిన సేవలు కర్ణాటక రాష్ట్రంలో ఎల్లకాలం నిలిచి ఉంటాయని నాయకులు పేర్కొంటున్నారు. ఎస్ఎం కృష్ణ మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు నాయకులు బెంగళూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సిద్ధరామయ్యకు బిజెపి, కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.