Suchetana Bhattacharya: ప్రతీ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. స్త్రీ లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు. కుటుంబం ఆర్థికంగా నిలబడడంతో.. దేశ ఆర్థికాభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యం కీలకం. దీంతో స్త్రీల ఎదుగుదలకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. విద్య, ఉద్యోగాల్లో నిరజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. అయినా.. లింగ వివక్ష మాత్రం కొనసాగుతోంది. పురుషులతో సమానంగా స్త్రీలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా.. ఆడపిల్ల అనగానే తక్కువ అనే భావన తొలగిపోవడంలేదు. ఈ క్రమంలో మహిళలు పురుషులుగా బతకాలనుకుంటున్నారు. గతంలో ఓ మహిళా కానిస్టేబుల్ తాను పురుషుడిగా మారేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందింది. తాజాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య కూడా పురుషుడిగా మారాలనుకుంటోంది. ఇందుకోసం లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటోంది. ఆపరేషన్ తర్వాత సుచేతన కాస్త సుచేతన్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నానని తెలిపింది. అవసరమైన «ధ్రువపత్రాలతో వైద్యులను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది.
వేధింపులను ఆపేందుకే..
ఇటీవల ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌కు సుచేతన హాజరయ్యింది. ఈ కార్యక్రమంలోమాట్లాడుతూ ‘నా తల్లిదండ్రుల లేదా కుటుంబ గుర్తింపు పెద్ద విషయం కాదు. నా ఎల్‌జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ట్రాన్స్‌మ్యాన్‌గా సమాజంలో ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను ఆపాలనుకుంటున్నాను. నా వయసు ప్రస్తుతం 41. నా జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు నేను తీసుకోగలను. దయచేసి నా తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దు. మానసికంగా తనను తాను మనిషిగా భావించే వ్యక్తి మనిషే. నేను మానసికంగా మగవాడిని. దానిని భౌతికంగా కూడా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపింది.
పోరాడే ధైర్యం ఉంది..
ఇంకా సుచేతన మాట్లాడుతూ తన నిర్ణయాన్ని తన తల్లిదండ్రులు కూడా గౌరవిస్తారని అనుకుంటున్నానని తెలిపారు. తనకు పోరాడే ధైర్యం ఉందని వెల్లడించారు. తాను నిర్ణయానికి వచ్చానని, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తన నిర్ణయాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
పురుషుడిగా మహిళా కానిస్టేబుల్..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్ విన్నపం మేరకు లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (ఎయిమ్స్)లో చికిత్స చేయించుకుంది. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు.