Telangana Vimochana Dinotsavam 2022: తెలంగాణలో మరోసారి అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోంది. దీనిని గమనించిన గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే విమోచన దినం కాకుండా సమైక్యత దినం పేరుతో మూడు రోజులు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీజేపీ రాష్ట్ర శాఖ కూడా వేడుకలు సాదాసీదాగా కాకుండా మూడు నాలుగు రోజులు వేడుకలతో సందడి చేయాలని భావిస్తోంది. సాయుధ పోరాట యోధులను గుర్తించి వారిని సత్కరించాలని భావిస్తోంది. ఇలా ఎత్తుకు పైఎత్తులతో సెప్టెంబర్ 17కు ఈసారి మరింత హైప్ తీస్తుంది. అయితే తెలంగాణ బీజేపీ రాజకీయ వ్యూహాల్లో టీఆర్‌ఎస్‌ను అందుకోలేకపోతోంది.

ఒకగుడు ముందే ఉంటున్న టీఆర్‌ఎస్..
బీజేపీ బ్రాండ్ అయిన మత పరమైన రాజకీయాల్లో తెలంగాణలో తమదైన ముద్ర వేస్తున్నప్పటకీ .. ఇతర విషయాల్లో మాత్రం టీఆర్‌ఎస్ ముందు కమలనాథులు తేలిపోతున్నారు. ఈ విషయం మరోసారి రుజువైంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయాలు జరగనున్నాయి. దీనికి కారణం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్‌లో తెలంగాణ విమోచనా దినోత్సవాలను నిర్వహిస్తోంది. తెలంగాణ సర్కార్ కూడా విడిగా ఆ పనే చేస్తోంది. కేంద్రంతో సంబంధం లేకుండా తాము కూడా మూడు రోజులపాటు ధూమ్ ధామ్‌గా ఈ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం ఎవరికి వారు ఘనంగా ప్రచారం చేసుకోవాలనుకున్నారు. బీజేపీ నేతుల హైదరాబాద్ మొత్తం హోర్డింగ్‌లు పెట్టాలనుకున్నారు. కానీ పెట్టలేకపోతున్నారు. ఎందుకే టీఆర్‌ఎస్ నేతలు పెట్టాలనుకోవడమే కాదు.. మొత్తం హోర్డింగ్‌లను బుక్ చేసేసుకున్నారు. దీంతో బీజేపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. దీంతో ప్రచారం విషయంలో టీఆర్‌ఎస్ ఒక అడుగు ముందే ఉన్నట్లయింది.
గత అనుభవం ఉన్నా.. జాగ్రత్త పడలేదు..
బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించింది. మూడు రోజుల సమావేశాల సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని హోర్డింగులను టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాల ప్రకటనలతో నింపేశారు. మెట్రో పిల్లర్లను కూడా వదలకుండా బోర్డులు పెట్టారు. ఇక ప్రధాని నిర్వహించిన భారీ బహిరంగ సభ ఎదుట కూడా టీఆర్‌ఎస్ హోర్డింగ్‌లే కనిపించాయి. ఆ అనుభవంతో అయినా బీజేపీ నేతలు జాగ్రత్త పడతారా అంటే అదీ లేదు. ఇప్పుడు తీరిగ్గా.. తమ ప్రకటనలు కనిపించకుండా టీఆర్‌ఎస్ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కన ఫ్లెక్సీలు పెట్టుకోవాలని భావిస్తున్నారు.

జరిమానాకు సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ..
హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు తొలగించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. తొలగింపు సాధ్యం కాని పక్షంలో భారీగా జరిమానా వసూలు చేయాలనుకుంటోంది. ఈ మేరకు మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీలు తొలగిస్తే చర్చ తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రెండు పార్టీల రాజకీయాల్లో తాము తలదూర్చడం కంటే జరిమానాతో సరిపెట్టడమే నయమని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.