MP Arvind
MP Arvind: నిజామాబాద్ పసుపు రైతులు మరోసారి కన్నెర్ర జేశారు. పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న తమల్ని నాయకులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తామని ఇప్పటి ఎంపీ అర్వింద్ బాండ్ పేపర్ పై కూడా సంతకం చేశారు. దీంతో గంప గుత్తగా పసుపు రైతులు ఆయనకే ఓట్లు వేసి గెలిపించారన్న ప్రచారం సాగింది. అయితే ఐదేళ్లుగా పసుపు బోర్డుపై గాలిమాటలు చెబుతూ కాలం గడుపుతున్నారని రైతులు, బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. కొంతకాలం కిందట అరవింద్ పర్యటనను అడ్డుకున్న పసుపు రైతులు బోర్డు తేవడంపై నిలదీశారు. ఇక ఊరుకునేది లేదని ఏకంగా పసుపు బోర్డులు పెట్టి వినూతన్న నిరసన చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు తోడై ఈ విషయాన్ని మరింత ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం రెండు పార్టీలు ఛాన్స్ దొరికితే విమర్శల దాడి చేస్తున్నారు. ఇటీవల కవిత లిక్కర్ కేసుపై బీజేపీ నాయకులు వరుసగా కామెంట్ల వరద పారించారు. వీరిలో ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో విమర్శించారు. అయితే అవకాశం కోసం వేచి చూసిన బీఆర్ఎస్ కు ఐడియా తట్టింది. ఇన్నాళ్లు పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్ ను ఎన్నిసార్లు నిలదీసినా పట్టించుకోలేదు. దీంతో వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు.
MP Arvind
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో రైతుల పేరిట అక్కడక్కడా పసుపు బోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బోర్డుపై ‘మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు ఇది’ అని రాసి కింద పసుపు రైతులు అని పెట్టారు. ఇలాంటి ఫ్లెక్సీలు పట్టణ వ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆశ్యర్యంగా చూస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో అధికారంలోకి వచ్చిన అర్వింద్ పసుపుబోర్డు తేలేక ఈ బోర్డును పట్టుకొచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఈ ఫొటోలతో హంగామా చేస్తూ అర్వింద్ పరువు తీస్తున్నారు.
అయితే అర్వింద్ మాత్రం పసుపు బోర్డు కోసం తాను ఎంపీ అయిన తెల్లారి నుంచే కృషి చేస్తున్నానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. పసుపు బోర్డుపై కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిశీలించానని చెప్పారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రైతు సమస్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లానని త్వరలో సమస్యలు పరిస్కారం అవుతుందని అన్నారు. కానీ ఇలా ఐదేళ్ల నుంచి ఎంపీ మాటలు చెబుతున్నారే తప్ప బోర్డు తీసుకురావడంలో ఏమాత్రం కృషి చేయడం లేదని రైతులు వాపోతున్నారు. మరి ఈ నిరసనపై ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.