Revanth Reddy: రేవంత్ కు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు

రేవంత్ తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటాయి. ఎక్కడికక్కడే ప్రజలు స్వచ్ఛందంగా ఆనందం పంచుకోవడం కనిపించింది. ముఖ్యంగా టిడిపి శ్రేణులు ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం విశేషం.

Written By: Dharma, Updated On : December 7, 2023 2:01 pm

Revanth Reddy

Follow us on

Revanth Reddy: తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా వేలాదిమంది ప్రజానీకం నడుమ ప్రమాణ స్వీకార మహోత్సవం వేడుకగా సాగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సైతం పాల్గొన్నారు. చంద్రబాబుకు సైతం ప్రత్యేక ఆహ్వానం ఉన్నా ఆయన హాజరు కాకపోవడం విశేషం.

రేవంత్ తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటాయి. ఎక్కడికక్కడే ప్రజలు స్వచ్ఛందంగా ఆనందం పంచుకోవడం కనిపించింది. ముఖ్యంగా టిడిపి శ్రేణులు ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం విశేషం. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో పని చేశారు. చంద్రబాబుకు అనుచరుడు కూడా. మొన్నటి ఎన్నికల్లో టిడిపి నాయకత్వం సైలెంట్ అయినా.. పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ కు పని చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును కూడాతమ పార్టీ విజయంగా చూసుకుంటున్నాయి.రేవంత్ రెడ్డి సీఎం కావడంతో సొంత పార్టీ నేత అయ్యారన్న రీతిలో టిడిపి శ్రేణులు వ్యవహరించడం విశేషం. టిడిపి సోషల్ మీడియా సైతం రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో దర్శనమిచ్చాయి. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ల ఫోటోలతో కూడిన ఈ ఫ్లెక్సీలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. రేవంత్ రెడ్డిని తమ వాడిగా చూపే భాగంలో స్థానిక టిడిపి నాయకులు ఎక్కడికక్కడే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఇప్పటికే రేవంత్ ఫోటోలతో కూడిన శుభాకాంక్షలు సందేశాలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఫ్లెక్సీలు కట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. బాణసంచా కాల్చుతూ స్థానికులు సంబరాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి వియ్యంకుడు, స్థానిక రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూమ్ అధినేత వెంకట్ రెడ్డి నివాసం వద్ద బాణసంచా కాల్చారు. పెద్ద ఎత్తున స్వీట్లు పంచారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అటు భీమవరం పట్టణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.