Revanth Reddy: కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడిందట.. అట్లున్నది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల తీరు. రేవంత్‌రెడ్డికి చెక్‌పెడదామని తిరుగుబాటు మొదలు పెట్టిన సీనియర్లు.. ఇప్పుడు తామే డిఫెన్స్‌లో పడ్డారు. తామే అసలైన కాంగ్రెస్‌వాదులం అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ను చిలువను పలువలు చేస్తున్న సీనియర్లకు టీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా చెక్ పెట్టారు. వారి ఎత్తుకు పైఎత్తుతో డ్యామేజ్ బ్యాచ్‌ను ఒంటరి చేశారు. టీపీసీసీ కొత్త కమటీలో చోటు దక్కిన తన వర్గానికి చెందిన 13 మందితో 9 మంది సీనియర్ల బ్యాచ్‌కు రివర్స్ పంచ్ ఇచ్చారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనుకున్న వారిపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేయించి కాంగ్రెస్‌పై పట్టు సాధించారు.

పీసీసీ కమిటీలతో లొల్లి షురూ..
కాంగ్రెస్ హైకమాండ్ ఏ క్షణాన కొత్త పీసీసీ కమిటీలను ప్రకటించిందో కానీ నాయకులు ఒక్కొక్కరు తిరుబాటు చేస్తున్నారు. కొండా సురేఖ నుంచి మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు బెల్లయ్య నాయక్ వయా కాంగ్రెస్ సీనియర్ల వరకు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్ రిలీజ్ చేసిన 2–3 రోజులు సైలెంట్‌గానే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదే అదునుగా రేవంత్‌రెడ్డి న్యాయకత్వంపై తిరుగుబాటు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో మరో సంచలనం నెలకొంది.
ఆ 13 మంది రాజీనామా..
రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 13 మందికి టీపీసీసీ కమిటీల్లో పదవులు లభించాయి. ఇదే సాకుగా సీనియర్లు రేవంత్‌పై తిరుగబాటు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సీసియర్ల ఎత్తుకు పైఎత్తు వేసిన రేవంత్‌రెడ్డి ఆ 13 మందితో రాజీనామా చేయించారు. అందులో సీతక్క, ఎర్ర శేఖర్, వేం నరేందర్, విజయరామారావు, చారకొండ వెంకటేశ్, పటేల్ రమేశ్, సత్తు మల్లేశ్, విజయరమణారావు సహా మరికొంతమంది ఉన్నారు. రాజీనామా చేస్తూ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. వలస వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న కాంగ్రెస్ సీనియర్ల ఆరోపణలతో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలు రాజీనామా బాట పట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగింది?
భట్టి నివాసంలో శనివారం భేటీ అయిన సీనియర్ నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. కొత్త కమిటీల్లో 108 మంది ఉంటే అందులో 50 మంది వలస వచ్చిన వారే అని మండిపడ్డారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమను కోవర్టులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చిన వారికి మధ్య పోరాటం జరుగుతుందని, వలస వచ్చిన వారి నుంచి∙కాంగ్రెస్‌ను సేవ్ చేయాలనే తాము చూస్తున్నామని ప్రకటించారు. కాం్రVð స్‌ను హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోందని, క్యారెక్టర్ లేని వాళ్లు పార్టీని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము నాలుగు పార్టీలు మారి రాలేదు. అసలు కాంగ్రెస్ నాయకులం మేమే. ఇందుకోసం ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో తేల్చుకుంటాం’ అని సీనియర్లు తెలిపారు. వలస వాదులతో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుంది. గెలిచే చోట డీసీసీ నియామకాలు ఆపారు. ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు వలస వాళ్లకే కేటాయించారని మండిపడ్డారు.
మరోవైపు పీసీసీ సమావేశం..
సీనియర్ల తిరుగుబాటుపై రేవంత్‌రెడ్డి సైలెంట్‌గా తన వ్యూహం అమలు చేశారు. తన వర్గానికి చెందిన 13 మందితో పదవులకు రాజజీనామా చేయించారు. ఇదే సమయంలో తామే కాంగ్రెస్ పరిరక్షకులమని, పదవులు లేకున్నా పనిచేస్తామని చెప్పించారు. పదవుల కోసం పార్టీలో చేరలేదని ప్రకటించడం ద్వారా.. ఆ 9 మంది బ్యాచ్‌ను డిఫెన్స్‌లో పడేశారు. మరోవైపు హైకమాండ్ ఆదేశాలతో గాంధీభవన్‌లో పీసీసీ సమావేశం నిర్వహించారు. సీనియర్ల తిరుగుబాటు గురించి కాకుండా ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సమావేశానికి జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, మల్లు రవి సహా పలువురు నాయకులు హాజరయ్యారు. దీంతో సీనియర్ల వ్యూహం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది.