Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా జరుగుతోంది. అక్కడక్కడా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నా.. మధ్యాహ్నానికి 37 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సీఎం కేసీఆర్ చింతమడకలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ కొడంగల్‌లో, కిషన్‌రెడ్డి, కేటీఆర్, కవిత హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు
డిసెంబర్ 9 తొలి కేబినెట్ భేటీ..
తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తాడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఈమేరకు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. సీఎం అభ్యర్థిని మాత్రం 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని వెల్లడించారు. సీఎంగా ఎవరిని ప్రకటించినా మద్దతు ఇస్తానని కూడా వెల్లడించారు. ఇక తాజాగా ఓటు వేసిన తర్వాత.. డిసెంబర్ 9న తొలి కేబినెట్ భేటీ కూడా ఉంటుందని ప్రకటించారు. 2018తో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలపడిందని చెప్తున్నారు. వాళ్ల నమ్మకానికి సర్వేలు కూడా బలం చేకూరుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. రేవంత్ తాజాగా కేబినెట్ భేటీ తేదీ కూడా ప్రకటించారని అంటున్నారు.
80 సీట్లు గ్యారంటీ..
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు కచ్చితంగా గెలుస్తుందని రేవంత్ ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రిని 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ప్రకటించారు. అదే ధీమాతో తాజాగా సీఎం ప్రమాణ స్వీకారంతోపాటు, కేబినెట్ భేటీ తేదీ కూడా ప్రకటించారు. మరి రేవంత్ ఆకాంక్ష నెరవేరుతుందా లేదా అనేది డిసెంబర్ 3న తేలుతుంది.