Indore: ఇండోర్.. భారత దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరం. మధ్యప్రదేశ్‌లోని ఈ నగరం వరుసగా మూడేళ్లుగా స్వచ్ఛతలో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఈ స్వచ్ఛమైన నగరంలో యాచకుల సమస్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు.. దాన ధర్మాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇటీవలే ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దానం చేసేవారు లేకుంటే.. యాచకులు(Beggars) ఉండరన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బిచ్చం ఎత్తుకునేవారిలో చాలా మందికి పక్కా ఇళ్లు, ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి.
దానం చేసి.. ఇండోర్‌లో గుడి మెట్ల వద్ద బిచ్చం ఎత్తుకుంటున్న యాచకురాలిని చూసి ఓ వ్యక్తికి జాలేసింది. వెంటనే ఆమెకు బిచ్ఛం వేశాడు. అది గమనించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఖాండ్వా రోడ్‌లోని గుడి ముందు కూర్చున్న మహిళా యాచకురాలికి డబ్బులు ఇస్తున్న విషయం గుర్తించి వ్యక్తిపై అధికారులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 ప్రకారం.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నేరం రుజువైతే అతడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.
యాచకులు లేని నగరంగా..
దేశంలోని పది నగరాలను యాచకులు లేని నగరాలుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు పది నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది హైదరాబాద్, ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇండోర్‌ను దేశంలో మొదటి బిచ్ఛగాళ్ల రహిత నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భిక్షను స్వీకరించడం, భిక్ష ఇవ్వడం, భిచ్చగాళ్ల నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా భిక్షాటన చేసేవారి సమాచారం ఇస్తే రూ.1000 రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించింది.
యాచకులకు సొంత ఇళ్లు..
ఇండోర్‌లో భిక్షాటన చేస్తున్న చాలా మందికి ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరి పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని, విదేశాల్లోనూ స్థిరపడ్డారని కూడా ప్రభుత్వం తెలిపింది. కానీ, కొందరు ముఠాలుగా ఏర్పడి యాచక వృత్తిని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో అక్కడి అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది.