Farmers Budget 2023: అప్పుల బాధతో అన్నదాత కునారిల్లుతున్నాడు. అధిక వడ్డీలు కట్టలేక ఉరితాడును ముద్దాడుతున్నాడు. ఆరుగాలం నెత్తిమీద దుమ్ము పోసుకున్నా వడ్డీకి పంట పండించలేకున్నాడు. ఏటికేడు పెట్టుబడి పెరిగిపోతోంది. పంటకు గిట్టుబాటు మాత్రం దక్కడంలేదు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కేంద్రమూ రైతుకు తీపి కబురు అందించింది. రైతుల కోసం ప్రత్యేకంగా రుణాలు ప్రకటించింది.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ లో రైతులకు తీపి కబురు అందించింది. రైతులకు రూ. 20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయంతో పాటు డైరీ, మత్య్సశాఖలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నట్టు తెలిపారు. పీఎం మత్స్యసంపద యోజన కింద అదనంగా రూ. 6 వేలకోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగులు నిర్మిస్తామని ప్రకటించారు.
Also Read: Budget 2023 PMAY: పేదలపై కేంద్రం అను”గృహం”; పీఎంఏవై కి ఎంత కేటాయించిందంటే?
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట వరంగా మారనుంది. ప్రభుత్వ లక్ష్యంతో కోట్లాది మంది రైతన్నలకు తక్కువ ధరకే రుణాలు దొరుకుతాయి. వ్యవసాయం భారం కావడానికి అప్పుల పై పెరుగుతున్న వడ్డీలే కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతులు పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులతో అప్పులు తీసుకుంటున్నారు. పెట్టుబడి పెట్టినా పంటకు గిట్టుబాటు ధరలు అందడంలేదు. దీంతో అప్పులకు వడ్డీలు పెరిగి.. అప్పుల భారం పెరుగుతోంది. మరోసారి పంట పెట్టడానికి కూడా రైతుకు పెట్టుబడి పుట్టడం లేదు. దీంతో సన్నకారు రైతులు వ్యవసాయం వదిలేసి వలస వెళ్తున్నారు. మధ్యతరగతి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
పంట పండినా.. దానిని నిల్వ చేసుకునే సామర్థ్యం రైతుకు లేదు. దీంతో పంటను తెగనమ్ముతున్నాడు. ఫలితంగా రైతుకు గిట్టుబాటు ధర దక్కడంలేదు. అదే పంటను నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్మగలిగితే రైతుకు గిట్టుబాటు అవుతుంది. పంటను నిల్వ చేసుకోవాలంటే గిడ్డంగులు అవసరం. గిడ్డంగుల నిర్మాణం రైతుతో సాధ్యం కాదు. బడ్జెట్లో గిడ్డంగులు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వార రైతుకు చాలా మేలు చేకూరుతుంది. అదే సమయంలో డైరీ, మత్స్సశాఖల పై ప్రభుత్వం దృష్టి పెట్టడం అభినందనీయం. వ్యవసాయానికి .. డైరీ, చేపల పెంపకం అనుబంధ పరిశ్రమలు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తే రైతాంగానికి ఎంతో లాభం చేకూరుతుంది.

ప్రభుత్వం బడ్జెట్లో చేసిన కేటాయింపులను దారిమళ్లకుండా చూడాలి. ఏ లక్ష్యం కోసం కేటాయించారో వాటికే ఖర్చు పెట్టాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులను దారిమళ్లించకుండా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలి. అప్పుడే రైతాంగానికి ప్రభుత్వ ఫలాలు అందుతాయి.
Also Read: Nara Lokesh Troll: ట్రోల్ ఆఫ్ ది డే : అడుక్కోవడంలో ‘లోకేష్’ పీహెచ్.డీ.. నువ్వు సూపర్ స్వామీ
