హుజురాబాద్ ఉప ఎన్నికలో ఊహాగానాలకే ప్రాధాన్యం ఏర్పడుతోంది. గాలి వార్తలనే నిజమనుకునే విధంగా తెలివి మీరిపోతున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో? ఏది వైరలో తెలుసుకోలేని స్థితిలో హుజురాబాద్ వాసులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాజకీయ ప్రాబల్యం మీదే ప్రధాన దృష్టి పెడుతున్నారు. జరగని దాన్ని జరిగినట్లుగా భావిస్తూ ఒకరిపై ఒకరు చేయిచేసుకునేంత అధ్వాన పరిస్థితికి దిగజారిపోతున్నారు. రాజకీయమే అస్ర్తంగా ఎదుటివారిని బురిడీ కొట్టించే విధంగా ప్రవర్తించడం వారి అనైతికతకు నిదర్శనమే.
ఈనేపథ్యంలో గురువారం హుజురాబాద్ లో ఓ విచిత్ర సన్నవేశం జరిగింది. ఈటల రాజేందర్ బావమరిది దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇదంతా ఫేక్ అని ఈటల వర్గీయులు హుజురాబాద్ లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దీంతో అక్కడకు చేరుకున్న టీఆర్ఎస్ నేతలకు, ఈటల వర్గీయులకు ఒక్కసారిగా గొడవ జరిగింది. ఇందులో ఎవరు బాధ్యులో ఎవరికి తెలియదు. కానీ విచిత్రమేమిటంటే సోషల్ మీడియాను ఆధారం చేసుకుని ఇంత బాధ్యతాయుతంగా రభస సృష్టించడమేమిటని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు.
ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే విధంగా ఇంత దారుణంగా ప్రవర్తించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఓట్ల కోసం ఇన్ని పాట్లు ఎందుకు? ఓటరు నాడి తెలుసుకుని మసలుకోవాల్సిన నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని తెలుస్తోంది. ఈ సంస్కృతి ఎక్కడికి దారి తీస్తుందో అని సగటు ఓటరు మథనపడుతున్నాడు. ప్రసార మాధ్యమాల్ని నమ్ముకుని వారి మనుగడకే ప్రమాదం తెచ్చుకుంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో పార్టీలు తమ నైతికతను మరిచిపోతున్నాయి. తమ గెలుపుకే పాకులాడుతూ ఓటర్ల మనోగతాన్ని పట్టించుకోవడం లేదు. చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తూ చులకన అయిపోతున్నా వాటిని గురించి ఏ మాత్రం లెక్క చేయకుండా కొట్లాటకే విలువ ఇస్తున్నాయి. ఓటర్ల దృష్టిలో దిగజారుతున్నా నిర్లక్ష్యంగా తమ ప్రభావమే గెలవాలని పట్టుబడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఉప ఎన్నికలో ఇలాగే చేస్తే ఓటర్లకు సైతం అసహ్యం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.