Huzurababd EXIT Poll: పంతం పట్టిన సీఎం కేసీఆర్ ఓవైపు.. ప్రతీకారంతో ఈటల రాజేందర్ మరోవైపు తలపడ్డ ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమరంలో ఎవరు విజేతలన్నది తెలియాలంటే ఈ రెండు మూడు రోజులు ఆగాల్సిందే. కానీ ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళి బయటకు వచ్చింది. మీడియా, కొన్ని స్వతంత్ర్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేశాయి. ఓటేసిన ఓటరు నాడిని పసిగట్టాయి. ఇందులో సంచలన ఫలితాలు బయటపడ్డాయి.
తెలుగు ప్రముఖ న్యూస్ చానెల్స్ తోపాటు పలు సర్వే సంస్థలు హుజూరాబాద్ ఓటర్ల నాడిని తెలుసుకున్నాయి. ప్రధానంగా హుజూరాబాద్ పట్టణం, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంత మండలం వీణవంక మండలాల్లో టీఆర్ఎస్ గాలివీచిందని తేలింది. ఈ రెండు మండలాల్లో బీజేపీ కంటే టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి తెలుస్తోంది.
ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ తోపాటు పక్కనే ఉన్న ఇల్లందకుంట మండలం, జమ్మికుంటలో బీజేపీ హవా నడిచిందని తేలింది. ముఖ్యంగా ఈటల సొంతమండలం కమలాపూర్ లో ఈటలకు భారీ ఓట్లు పడ్డాయని.. ఆయనను గెలిపించేది ఆ మండలం అని అంటున్నారు. ఇక ఆ తర్వాత జమ్మికుంట, ఇల్లండకుంటలోనూ 2500 ఓట్ల మెజార్టీని ఈటల సాధిస్తాడని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
ఇక హుజూరాబాద్, వీణవంకలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నా అది స్వల్పమేనని.. రెండు వేల లోపు మాత్రమే మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
ప్రస్తుతం మీడియా చానెల్స్, సర్వే సంస్థలు తేల్చిన లెక్క ప్రకారం.. హుజూరాబాద్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచిందని.. ఈటల రాజేందర్ కేవలం 3వేల నుంచి 5వేల లోపు మెజార్టీతోనే గెలుస్తాడని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. మరి అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది మాత్రం నవంబర్ మొదటి వారంలో కౌంటింగ్ లోనే తేలనుంది.అప్పటివరకూ ఈ అంచనాలో మనం ఊహించుకోవాల్సిందే.