టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయనను శుక్రవారం ఉదయం 7.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నిమ్మాడకు మూడు వందల మందికిపైగా పోలీసులు చేరుకున్నారు. అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రహరీ గోడ దూకి ఆవరణలోకి ప్రవేశించి అనంతరం తలుపులు కొట్టడంతో ఇంటి లోపలివారు తలుపులు తీశారు.
దీంతో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి అచ్చెన్నాయుణ్ని అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో తీసుకు వెళ్లారు. అచ్చెన్నాయుడు కుమారుడు సురేష్ కు అరెస్టుకు సంబంధించిన నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వివిధ సెక్షన్ ల వివరాలు వెల్లడించారు. అచ్చెన్నాయుడిని తొలుత విశాఖపట్నం తరలిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, ఇతర పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని గతంలోనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ చేపట్టిన ఏసీబీ గతంలోనే అచ్చెన్నాయుడుకు నోటీసులు ఇచ్చింది. ఈ రోజు అరెస్టు చేసింది. ఇదే విషయంలో ఈ.ఎస్.ఐ ఉన్నతాధికారి ఒకరిని తిరుపతిలో అరేసు చేసినట్లు సమాచారం.