ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం జగన్ నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెట్టారు. దీంతో పలువరు నాయకుల కుర్చీలు అందకుండాపోతున్నాయి. ఆడవారికే పదవులు అని చెప్పడంతో నాయకులు ఖంగుతింటున్నారు. తమ పదవి చేజారిపోతున్నందుకు దిగులు చెందుతున్నారు. మీ ఇంటికే మీ పదవి అంటూ జగన్ తీసుకున్న నిర్ణయంపై అందరిలో అసంతృప్తి రేగుతోంది.
మహిళా రిజర్వేషన్ తో పదవులు దక్కకుండా పోవడంతో నాయకుల్లో భయం పట్టుకుంది. తమ ఇంట్లో ఆడవారు పదవి చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో అవకాశం చేజారిపోతోంది. ఇలాంటి వారిలో విశాఖ జిల్లాలో ఇద్దరు నాయకులు అలాగే పదవులు కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ కు కీలకమైన పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది. విశాఖ కాకినాడ పెట్రో కారిడార్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినా మహిళా కోటా కింద ఆయన సతీమణికి ఇస్తామని చెప్పడంతో ఆయన భార్యకు అనారోగ్యం కారణంగా ఆ పదవి చేజారిపోయింది.
అలాగే విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు సుకుమార వర్మకు మూడో సారి ఇవ్వాలని చూసినా మహిళా రిజర్వేషన్ కారణంగా ఆయన సతీమణికి ఇస్తామని చెప్పగా అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆ పదవి అందకుండా పోయింది. దీంతో ఆయనలో నైరాశ్యం నెలకొంది. ఆ పదవి చివరికి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరదలు అనితకు దక్కడంతో కన్నబాబు రాజు వర్గం నిరాశ చెందింది.
జగన్ తీసుకొచ్చిన కొత్త విధానంతో చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళా కోట రూల్ తో నచ్చకపోయినా పదవి తమ ఇంటికే దక్కాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. ఇన్నాళ్లు లాబీయింగ్ చేసిన నాయకుల ఆగడాలకు జగన్ ఈ విధంగా చెక్ పెట్టారని తెలుస్తోంది. కొందరైతే తమకే పదవి ఇవ్వాలని పేచీ పెడతుతూ గొడవకు దిగడం చూస్తున్నాం. అయినా అధినేత మాత్రం రిజర్వేషన్ కే పెద్దపీట వేయడం గమనార్హం.