Homeజాతీయ వార్తలుKCR : ఫోన్ చేసినా కేసీఆర్ ఎత్తడం లేదట?

KCR : ఫోన్ చేసినా కేసీఆర్ ఎత్తడం లేదట?

KCR : కేసీఆర్..అప్పట్లో మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఏకంగా క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టారు. అక్కడితో ఆగలేదు. కర్ణాటక చుట్టి వచ్చారు. ఏపీలో పార్టీని ప్రారంభించారు. తోట చంద్రశేఖర్ అనే వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. వైజాగ్ స్టీల్ బిడ్ లో సింగరేణిని భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. ఇవి మాత్రమే కాదు తనకు రోజు డప్పు కొట్టే నమస్తే తెలంగాణను ఏపీలోనూ ప్రారంభిస్తామన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ చేసి ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.. అట్టహాసంగా ప్రారంభించారు. ఇంత ఘనంగా అన్ని చేస్తే ఏం జరిగింది? పార్టీ పుట్టిన తెలంగాణలోనే ఓడిపోయింది.. తెలంగాణ మోడల్ అని ప్రచారం చేసుకుంటే ప్రజల నుంచి తిరస్కారం ఎదురైంది. అంతేకాదు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే “బంగారు తెలంగాణ” అని చేసిన ప్రచారం వట్టిదే అని తేలిపోతోంది.

ఖతం అయినట్టేనా?

భారత రాష్ట్ర సమితి పరిస్థితి జాతీయ స్థాయిలో ఖతం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణను కేంద్రంగా చేసుకొని అప్పట్లో భారత రాష్ట్ర సమితి దేశం మొత్తం విస్తరించాలని కేసీఆర్ కలలుగన్నారు. ఇందుకోసం కొంత ప్రయత్నం చేశారు. చాలావరకు డబ్బు ఖర్చు పెట్టారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి సారించారు. ప్రభుత్వ డబ్బులతో అక్కడి పత్రికలకు జాకెట్ యాడ్స్ ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులతో చాలాసార్లు ఆ రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పలుమార్లు బహిరంగ సభలు నిర్వహించారు. మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి కొన్నిచోట్ల విజయం సాధించినట్లు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కేసీఆర్ అనుకున్నట్టు అన్నీ జరిగితే కథ వేరుగా ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణలోనే పార్టీని కాపాడుకోలేని స్థితికి కేసీఆర్ చరిష్మా పడిపోయింది. దీంతో మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది. అందుకే కేసీఆర్ అటు మహారాష్ట్ర, ఇటు ఏపీ నేతలతో టచ్ లో ఉండటం లేదని తెలుస్తోంది. కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారస్థాయికి చేరింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించి రకరకాల కసరత్తులు చేస్తున్నాయి. కానీ భారత రాష్ట్ర సమితి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఏపీలోని నేతలకు ఆ పార్టీ అధిష్టానం చెప్పలేదట. ఈ విషయం తెలియకుండా ఆ పార్టీ నేతలు కేసీఆర్ ను కలవాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని తెలుస్తోంది. ఇక ఏపీలోని భారత రాష్ట్ర సమితి నేత రావెల కిషోర్ బాబు చాలా రోజుల క్రితమే వైసీపీలో చేరారు. తోట చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. ఆయన ఏపీ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన కూడా త్వరలోనే భారత రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ పరిణామాలతో భారత రాష్ట్ర సమితి అధ్యాయం ఆంధ్రప్రదేశ్లో ముగియబోతుందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మహారాష్ట్రలో కూడా చాలామంది నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు రాజీనామా చేశారు. “ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునేంత స్థాయిలో పెద్దపెద్ద నాయకులు లేరు కాబట్టి అక్కడ హడావిడి ఏమీ లేదు. ఎలాగూ పోటీ చేయడం లేదు కాబట్టి అధ్యక్ష పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని తోట చంద్రశేఖర్ భావించి.. తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేస్తే.. ఆంధ్రప్రదేశ్లో కారు పార్టీకి కార్యాలయం కూడా ఉండదని” రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular