మానవుడి మొదటి పోరాటం కడుపు నింపుకోవడానికి.. తర్వాతి ఆరాటం ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి! సగటు మనిషి నుంచి.. సామ్రాజ్యవాద దేశాల వరకూ విధానం ఇదే. లక్షల ఏళ్ల మానవ చరిత్ర తవ్వినా కూడా కనిపించే సమాధానం ఇదే. వర్తమానం పరిశీలించినా ఇదే.. రేపటి భవిష్యత్ ను అంచనా వేసినా కనిపించేది ఇదే! అయితే.. నిన్నా మొన్నటి వరకూ ప్రపంచలో పెద్దన్న ఎవరంటే.. అందరూ అమెరికా వైపే వేలు చూపించేవారు. కానీ.. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి!
ప్రపంచ దేశాల్లో చైనా అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా విస్తరిస్తోంది. దాని దూకుడు ముందు అమెరికా కిరీటం కిందపడేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆధిపత్యం కొనసాగిస్తున్నవారు.. కుర్చీ దిగిపోవడానికి సిద్ధంగా ఉండరు కదా.. అందుకే.. చైనా – అమెరికా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒక్క అమెరికానే కాదు.. యూరప్ లోని బలమైన దేశాలు చైనా ఆధిపత్య పోరాటాన్ని సవాల్ చేస్తున్నాయి. సముద్ర జలాల వివాదం మొదలు.. మైదాన ప్రాంతంలోని ప్రాజెక్టుల వరకూ ఈ దేశాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని మనం గమనించొచ్చు.
అయితే.. ప్రపంచంపై ఆధిపత్యం కోసం చైనా ‘బెల్ట్ అండ్ రోడ్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 60 దేశాల్లో నిర్మాణ రంగంలో పలు ప్రాజెక్టులను కొనసాగిస్తోంది. భూమి, సముద్రం మార్గాల ద్వారా మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరోప్, తూర్పు దేశాలు, ఆఫ్రికా.. ఇలా అన్ని ఖండాలతోనూ తనను అనుసంధానం చేసుకుంటోంది. కష్టాల్లో ఉన్న ఆయా దేశాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని చైనా చెబుతోంది. యూరోపియన్ యూనియన్ లోని దేశాలు మాత్రం.. ఆధిపత్యం పెంచుకునేందుకు చైనా చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు.
దీన్ని అడ్డుకునేందుకు అమెరికా సహా.. ఈయూ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నాయో తెలిసిందే. గత జూన్ లో ఇంగ్లండ్ లో జరిగిన జీ7 దేశాల సదస్సులో మెజారిటీ చర్చ చైనాను నిరోధించే అంశాలమీదనే సాగడం గమనార్హం. తాజాగా.. ఈయూ (యూరోపియన్ యూనియన్) దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం గ్లోబల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ను అంగీకరించారు. ప్రపంచానికి కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా చైనా కొనసాగిస్తున్న ఆధిపత్య చర్యలకు ప్రతిగా ఈయూ దేశాలు ఈ విధానాన్ని ముందుకు తెచ్చాయి.
దీని ప్రకారం ఈయూ.. ఆసియాతో భారీ కనెక్టివిటీ ప్రణాళికను అమలు చేయనుందన్నమాట. ఈయూ-అమెరికా కలిసి చైనాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం చైనా బలమైన ఆర్థిక శక్తిగా తయారైందనే విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. కరోనా కష్ట కాలంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలితే.. చైనా మాత్రమే రెండంకెల వృద్ధిరేటును నమోదు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో.. చైనా మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త పెద్దన్నగా తయారయ్యేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఈయూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి, ఈయూ తెచ్చిన గ్లోబల్ ఇన్ స్ట్రక్చర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అసలు ఆ ప్లాన్ ద్వారా ఏయే దేశాల్లో.. ఏమేం చేయనున్నారు? అన్నది చూడాలి.