Manipur Crisis: మెయితీల తిరుగుబాటు మొదలైంది.. మణిపూర్ లో మళ్ళీ ఏం జరుగుతోంది?

జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం తమను మైదాన ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసిన కుకీలపై మెయితీలు తిరగబడుతున్నారని తెలుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 1, 2024 11:10 am
Follow us on

Manipur Crisis: గత ఏడాది జూన్ లో మణిపూర్ లో కుకీ, మెయితీ తెగల మధ్య జరిగిన గొడవ ఎంత దారుణానికి దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలవంతంగా మతం మార్చుకుని.. గిరిజన ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. తమను కేవలం మైదానాలకే పరిమితం చేశారని కుకీలపై మెయితీలు ఆరోపించడం మొదలుపెట్టారు.. మణిపూర్ లోని కొండ ప్రాంతాలను మొత్తం కుకీలు ఆక్రమించుకున్నారని విమర్శిస్తూ వారిపై దాడులకు పాల్పడ్డారు. అప్పట్లో ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది..మెయితీ లకు బిజెపి అండదండలు అందిస్తోందని, అక్కడ జరుగుతున్న గొడవలకు ఆ పార్టీనే కారణమని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మణిపూర్ వివాదం పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం అక్కడ బలగాలను మోహరించింది. గొడవలు జరగకుండా నిలుపుదల చేసింది. కొద్దిరోజుల పాటు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో మళ్లీ అలజడి మొదలైంది.

జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం తమను మైదాన ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసిన కుకీలపై మెయితీలు తిరగబడుతున్నారని తెలుస్తోంది. “మతం మార్చుకొని.. అటవీ ప్రాంతంలో తన మతానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టి.. మా సంస్కృతి సంప్రదాయాలపై విష ప్రచారం చేస్తున్నారని” ఆరోపిస్తూ మెయితీలు ఆందోళన చేస్తున్నారు. అయితే మొన్నటిదాకా ఆందోళనలతో అట్టుడికి పోయిన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందనుకుంటే.. మెయితీలు మళ్లీ తిరుగుబాటు ప్రారంభించారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో కుకీల పెత్తనం ఏమిటని మండిపడుతున్నారు.

మెయితీల తిరుగుబాటు నేపథ్యంలో కుకీలు కూడా స్పందిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, మతం పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే అధికారం మెయితీలకు ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు..”మేము గిరిజనులం. కొండ ప్రాంతాల్లోనే ఉంటాం.. అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు.. అలాంటప్పుడు మా ప్రాంతంలోకి వారు ఎలా వస్తారు? మా జన సమూహం ఆరాధించే దైవాలకు మందిరాలు నిర్మిస్తే తప్పు ఎలా అవుతుంది” అంటూ కుకీలు విమర్శిస్తున్నారు.

కాగా గత ఏడాది జూన్ నెలలో అటు కుకీలు, ఇటు మెయితీల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ రెండు తెగల గొడవలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. దీంతో మణిపూర్ మంటల్లో చిక్కుకుంది. సుమారు మూడు నెలల వరకు ఆ రాష్ట్రంలో భద్రత దళాలు కర్ఫ్యూ విధించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ ను ప్రభుత్వం నిలుపుదల చేసింది. మళ్లీ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆ ప్రాంతంలో గొడవలు ప్రారంభమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తమ హక్కులు నెరవేర్చుకునే దాకా ఉద్యమాలు చేస్తామని మెయితీలు అంటుంటే.. తమపై దాడులు చేస్తే ఊరుకోబోమని కుకీలు అంటున్నారు.. మరోవైపు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం సహాయం కోరడంతో బలగాలను దింపే యోచనలో ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితులు నివురు గప్పిన నిప్పులాగానే ఉన్నాయని తెలుస్తోంది.