
అనుకున్నట్టే మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ తో పోరాటానికి రెడీ అయ్యారు. తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయబడ్డ ఈటల రాజేందర్ ఇకతాను ఎంత మాత్రం కేసీఆర్ దయాదక్షిణ్యాలపై ఆధారపడకూడదని డిసైడ్ అయ్యారు. అందుకే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. తాజాగా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
శామీర్ పేట నుంచి తన అనుచరులతో గన్ పార్క్ కు చేరుకున్న ఈటల.. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఈటల భావోద్వేగంతో మాట్లాడారు. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగనని..విలువలకు కట్టుబడి ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనను రాజీనామా చేయమని ప్రజలే ఆశీర్వదించారని తెలిపారు. టీఆర్ఎస్ బీఫాం ఇచ్చినా తనను గెలిపించింది మాత్రం ప్రజలేనన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు.
ఈటల రాజేందర్ ఈనెల 14న బీజేపీలో చేరనున్నారు. ప్రత్యేక చార్టెడ్ విమానంలో కీలక నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసి వచ్చారు.
నిన్న రాత్రిసైతం బీజేపీ తెలంగాణపార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ తోపాటు తెలంగాణ బీజేపీ నేతలకు విందు ఇచ్చిన ఈటల వచ్చే ఎన్నికల్లో వారి సహాయం కోరారు. టీఆర్ఎస్ ను ఓడించడమే ధ్యేయంగా ఈటల రాజేందర్ రాజకీయం మొదలుపెట్టారు.
ఇక ఈటల వెంట బీజేపీలో చేరే వారిలో మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, బాబయ్య తదితరులు ఉన్నారు.