https://oktelugu.com/

కరోనా పోరాటంలో ముందు వరసలో ఈటెల, కనిపించని కేటీఆర్

టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉంటూ, ఆయనతో కలసి పనిచేస్తున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు కరొనపై పోరాటంలో సహితం ముందుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సంక్షోభ సమయంలోనే నాయకత్వ లక్షణాలు వెల్లడి అవుతాయి అన్నట్లు అప్పటి వరకు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా అంతా తానే అయి నడిపిస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు జనంలో ఎక్కడ కనిపించడం లేదు. నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన […]

Written By: , Updated On : April 11, 2020 / 11:29 AM IST
Follow us on


టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో కలసి తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో ఉంటూ, ఆయనతో కలసి పనిచేస్తున్న ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పుడు కరొనపై పోరాటంలో సహితం ముందుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు.

సంక్షోభ సమయంలోనే నాయకత్వ లక్షణాలు వెల్లడి అవుతాయి అన్నట్లు అప్పటి వరకు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా అంతా తానే అయి నడిపిస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు జనంలో ఎక్కడ కనిపించడం లేదు.

నాలుగు సార్లు ఎమ్యెల్యేగా గెలుపొందిన రాజేంద్ర కేసీఆర్ మంత్రివర్గంలో తొలి ఐదేళ్లు ఆర్ధిక మంత్రిగా సమర్ధవంతంగా పనిచేశారు. అదే సమయంలో నీటిపారుదల మంత్రిగా అంతే సమర్థతతో పనిచేసిన కేసీఆర్ మేనల్లుడు టి హరీష్ రావు, రాజేందర్ తొలినుండి సన్నిహితులు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు రాష్ట్ర పాలనా బాధ్యతలు అప్పచెప్పడం కోసం రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు సమర్థులుగా పేరొందిన హరీష్ రావు, రాజేందర్ లకు మంత్రి పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచారు.

కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వక పోయినా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చి, తెర వెనుక నుండి మొత్తం ప్రభుత్వాన్ని నడిపించే సౌలభ్యం కల్పించారు. అయితే నరేంద్ర మోదీ అద్భుతమైన ఆధిక్యతతో రెండోసారి ప్రధాని పదవి చేపట్టడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల కలలు చెదిరిపోయాయి.

మరోవంక కేటీఆర్ సామర్ధ్యం పట్ల పార్టీ వర్గాలలోని పెదవి విరుపులు ప్రారంభమయ్యాయి. దానితో విధి లేక కేటీఆర్ తో పాటు వీరిద్దరిని కూడా తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతగా ప్రాధాన్యత లేదని భావించే ఆరోగ్య శాఖను రాజేందర్ కు అప్పచెప్పారు.

అయితే కరోనా సంక్షోభంలో ఇదే కీలకమైన మంత్రిత్వ శాఖ కావడం, సహజంగానే అందరిని కలుపుకుపోగల సామర్ధ్యం ఉండడం, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ కు పరిమితమై ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి రాజేందర్ నడిపిస్తున్నారు.

పొరుగున ఉన్న ఏపీలో ఆరోగ్య మంత్రి పేరు కూడా అక్కడి ప్రజలకు తెలియదు. కానీ ఇక్కడ రాజేందర్ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపలేని విధంగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు.

కేటీఆర్ తన ఉనికి చాటుకోవడం కోసం ట్విట్టర్ సందేశాలను, ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చే విరాళాలను కేసీఆర్ బదులు స్వీకరించడం వంటి పనులకు పరిమి తమవుతున్నారు. కేటీఆర్ ఎన్నడూ క్షేత్రస్థాయిలో పనిచేసినవారు కాకపోవడం, పైగా ఆయన వ్యవహరించే తీరు కొంచెం ఆధిపత్య ధోరణిలో ఉంటూ ఉండడంతో ఉన్నతాధికారులు, మంత్రులు సహితం అసంతృప్తితో ఉంటారు.