Pawan Kalyan- Etcherla Parvati: విజయనగరం… ఇదో చరిత్రాత్మక చిహ్నం. ఇక్కడ రాజులు ఉన్నారు. దశాబ్దాలుగా రాజకీయాలు ఏలిన వారూ ఉన్నారు. కానీ అభివృద్ది మాత్రం ఎక్కడి వేసిన గొంగళిలా అక్కడే ఉంది. టీడీపీ వస్తే అశోక్ గజపతిరాజు,వైసీపీ వస్తే బొత్స సత్యనారాయణ హవా .. ఇది అక్కడ నడిచే నికర్సు అయిన రాజకీయం. రాజుగారి రాజకీయం ఒక ఎత్తయితే.. మరి బొత్స గారి రాజకీయం మరీ బీభత్సంగా ఉంటుంది. జిల్లా అంతటా తన కుటుంబ హవా నడుస్తోంది. తానేమో మంత్రి, సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం ఎమ్మెల్యే, మరో సోదరుడు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే, మేనల్లుడు, మొన్నటి వరకూ షాడో నేతగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్.. ఇలా విజయనగరాన్ని తన కుటుంబ రాజకీయ అడ్డాగా మార్చుకున్నారు బొత్స. అందుకే జగన్ కు ఇష్టం లేకున్నా విజయనగరం జిల్లా సామంత రాజుగా ఉన్న బొత్సకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. తొలి కేబినెట్ లో మంత్రిగా తీసుకోవడంతో పాటు విస్తరణలో కొనసాగింపు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు దాపురించాయి. అటువంటి బలమైన నేత అడ్డాలో జనసేన జవసత్వాలు నింపుకుంటోంది. బలమైన శక్తిగా మారుతోంది. ఇప్పటికే కొందరు పవన్ గూటికి చేరుతుండగా.. మరికొందరు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఈ క్రమంలోనే అక్కడ జనసేనకు చెందిన ఓ వీర మహిళ విరోచిత పోరాటం బయటపడింది. బొత్స సామంత రాజ్యంగా ఉన్న విజయనగరంలో రాయలసీమ తరహాలో జడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. చాలా స్థానాలకు అసలు పోటీయే లేకుండా పరిస్థితి నడిచింది. అటువంటి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో నేను పోటీచేస్తానంటూ ఆరు పదులకు దగ్గరగా ఉన్న ఓ వీర మహిళ ముందుకొచ్చింది. జడ్పీటీసీగా పోటీచేసి 1000 ఓట్లు సాధించింది. అధికార పార్టీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి గట్టి పోరాటమే చేసింది. ఆమె పేరు ఎచ్చెర్ల పార్వతి. ఓ సాధారణ గృహిణి, వ్యవసాయ కూలిగా ఉంటూ సాహసోపేత నిర్ణయంతో ఎన్నికల బరిలో దిగింది. ఎదురుగా అధికార పార్టీ రూపంలో రాక్షస సైనం ఉన్నా ఎదురొడ్డి పోరాడింది. తనతో పాటు జనసేన ఉనికిని చాటిచెప్పింది ఈ వీర మహిళ,
ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో చాలా ప్రాంతాలను సందర్శించారు.విషయం తెలుసుకున్న పార్వతి నాదేండ్ల మనోహర్ ను కలుసుకున్నారు. నాడు ఎన్నికల్లో ఎదురైన పరిస్థితులను వివరించారు. పవన్ బొమ్మ, ఆయన ఆశయాలతో ముందుకెళ్లాలని.. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలు చెబితే 1000 ఓట్లు పొందగలిగానని చెప్పుకొచ్చారు. ప్రజల్లో జనసేన పైనా, పవన్ పైనా సానుకూలత ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే జనసేనకు ఉజ్వల భవిత ఉందని కూడా తన మనసులో మాటను మనోహర్ ఎదుట విన్నవించారు. అయితే ఈ వీడియోలు పొలిటికల్ సర్కిల్ లో వైరల్ అవుతున్నాయి. తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ దీనిపై స్పందించారు. పార్వతి తెగువకు తెగ ముగ్ధుడయ్యారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. అవి ఆయన మాటల్లోనే.. ఎన్నికల్లో పోటీ చేయడం కొన్ని కుటుంబాలకే పరిమితం, ఏకగ్రీవం చేసుకుంటామనే నియంతృత్వస్వామ్యానికి ఊపిరిపోస్తున్న తరుణంలో ‘నేను నిలబడతాను’ అని సాధారణ గృహిణి శ్రీమతి ఎచ్చెర్ల పార్వతి గారు ధైర్యాన్ని చూపడమే జనసేన సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు.ప్రజాస్వామ్య ప్రక్రియను తోసిరాజని బూర్జువా పోకడలతో ఆధిపత్యం చెలాయిస్తే పార్వతి గారు లాంటివాళ్లు కచ్చితంగా నిలువరిస్తారు. అని కూడా పవన్ అన్నారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు నెటిజెన్లు సైతం ఎవరీ మహిళ అని ఆసక్తిగా చూస్తున్నారు.