
ఈటల రాజేందర్ బీజేపీలో చేరే కార్యక్రమం ఓ రేంజ్ లో ఉంటుందని అందరు భావించారు. కానీ ఆచరణలో మాత్రం ఏమీ కనిపించలేదు. ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మొదటి బుక్కలోనే కంకెడు రాయి తగిలినట్లుగా తయారయింది పరిస్థితి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలోనే చేరాలని షరతు విధించి నా ఆయన కల నెరవేరలేదు.
చివరికి పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ తో కండువా కప్పుకోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది.
ఈటల చేరిక తేదీ 13నే ఖరారు అయినా జేపీ నడ్డా అందుబాటులో ఉండరని 14కు మార్చారు.అయినా 14న కూడా ఆయన లేకపోవడంతో ఈటల వర్గీయుల్లో నిరాశ ఎదురైంది. మొదటి అడుగులోనే అవమానించారనే అభిప్రాయం వ్యక్తమయింది.
దీంతో బీజేపీ అధినాయత్వం ఏం సమాధానం చెబుతుందోనని చూస్తున్నారు. బీజేపీలో చేరిక కార్యక్రమం పూర్తయ్యాక అందరు కలిసి జేపీ నడ్డా ఇంటికి వెళ్లి పరిచయ కార్యక్రమాలు ముగించుకున్నారు. ఫొటోసెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒక్క ఈటల మాత్రమే కాదు తెలంగాణ నుంచి ముఖ్యనేతలందరు వెళ్లారు. ముఖ్యంగా బండి సంజయ్ అనుచరులు పెద్ద ఎత్తున వెళ్లారు.
తెలంగాణ బీజేపీలో గ్రూపులున్నాయన్న ప్రచారం నేపథ్యంలో జేపీ నడ్డాతో ఈటల కండువా కప్పించకుండా చేశారన్న అనుమానాలు ఈటల వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీలో చేరిపోయారు. ఇక వెనకడుగు వేయలేరు. ఆపార్టీలో సర్దుకుపోవాలి కాబట్టి ఈటల కూడా ఎక్కడా తన అసంతృప్తిని బయట పెట్టుకోలేదు