Harish Etela Rajendar: తెలంగాణ కేబినెట్ ను వీడకముందు వరకూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్, హరీష్ రావులు జిగ్రీ దోస్తీ. సీఎం కేసీఆర్ కోపాగ్నికి గురై ఈటల రాజేందర్ బర్త్ రఫ్ అయ్యి పార్టీని వీడాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో మామ కేసీఆర్ పక్షాన హరీష్ రావు దిగి పాత మిత్రుడు, దగ్గరి సన్నిహితుడైన ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా హరీష్ రావు పోరాడాల్సి వచ్చింది. వారిద్దరూ మంత్రివర్గంలో కలిసి పనిచేసేవారు.. ఉమ్మడి ఆలోచనలు పంచుకునేవారు. వారిద్దరి నియోజకవర్గాలలో బలమైన మద్దతుగల నేతలు.
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాల్సి రావడంతో హరీష్ రావు, ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్వయంగా హరీష్ రావుకు అప్పగించడంతో ఈటల, హరీష్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా బద్ద శత్రువులుగా మారారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈటలను ఓడించేందుకు హరీష్ రావు నియోజకవర్గంలో మకాం వేసి సర్వశక్తులూ ఒడ్డారు.
హరీష్ రావు అధికార బలంగా ఈటల సహచరులందరినీ బెదిరించో బతిమిలాడో.. కొనుగోలు చేసే తనవైపు లాక్కున్నాడన్న విమర్శలు వచ్చాయి. ఈటలను దాదాపుగా ఒంటరిని చేయడంలో హరీష్ రావు సక్సెస్ అయినా వారందరి ఓట్లు పడకుండా చూడడంలో మాత్రం విఫలమయ్యాడు. ఎంతో డబ్బు ఖర్చు చేసినా కూడా ఈటలను ఓడించలేకపోయారు.
కేసీఆర్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు. ఇది ముఖ్యంగా హరీష్ రావుకు నైతికంగా దెబ్బగా మారింది. ఎందుకంటే టీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్. ఎక్కడ గెలిపించాలన్న హరీష్ తోనే సాధ్యం. కానీ మొన్న దుబ్బాకలో.. నేడు హుజూరాబాద్ లో హరీష్ రావు గెలిపించలేకపోయాడు.
గెలుపు సంబరాల్లో ఉన్న ఈటల రాజేందర్ హైదరాబాద్ వెళుతూ దీపావళి రోజున సిద్దిపేటలో ఆగారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ కు సవాల్ విసిరారు. హరీష్ రావు అన్యాయం, అక్రమార్కుల పక్షం వహించారని.. డబ్బు, మద్యం పంపిణీ చేసి హుజూరాబాద్ లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించారని విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంట ఉంటే ఈ కుటిల వ్యహాలను హరీష్ రావు బలి అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. హరీష్ రావు ఇప్పటికే టీఆర్ఎస్ ను వీడి తమతో రావాలని.. తము అక్కున చేర్చుకుంటామని సంచలన పిలుపునిచ్చారు.
హరీష్ రావు నియోజకవర్గంలో దళితుల భారీ సభ నిర్వహిస్తానని.. గర్జన ర్యాలీకి తానే నాయకత్వం వహిస్తానని ఈటల చెప్పుకొచ్చాడు. హరీష్ రావు తనను ఎలాగైతే టార్గెట్ చేశాడో ఇప్పుడు సిద్దిపేటను టార్గెట్ చేస్తానని.. అతడు గెలవకుండా చేస్తానని ఈటల పిలుపునివ్వడం విశేషం.
దీన్ని బట్టి ఈటల రాజేందర్ కూడా నయానో భయానో హరీష్ రావును ఎలాగైనా పార్టీని వీడేలా చేయడానికి ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యాడు. మరి ఈటల బెదిరింపులకు హరీష్ భయపడుతాడా? లేదా? అన్నది వేచిచూడాలి.