
ఈటల రాజేందర్ తన కార్యకలాపాలు వేగవంతం చేశారు. అప్పుడే నాయకులందరితో తన నివాసంలో
సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఈటలపై ఫిర్యాదు మొదలుకుని విచారణకు ఆదేశించడం, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం లాంటి పరిణామాలు జరిగిపోయాయి. దీంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఊహించని దెబ్బలు ఎదురు కావడంతో కొంత స్తబ్దుగా ఉన్న తేరుకుని సొంత నిర్ణయాలు తీసుకున్నారు.
సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగినా చివరికి బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈటల విందు రాజకీయానికి తెరలేపారు. శామీర్ పేటలోని తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, బీజేపీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యేలు రఘునందన రావు, రాజాసింగ్, ఎంపీ బాపురావు, రాంచంద్రరావు, ఎ. చంద్రశేఖర్ వివేక్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో ఈటల రాజీనామా అనంతరం చోటుచేసుకునే పరిణామాలపై చర్చించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆలోచించినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అనుసరించబోయే వ్యూహాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. పార్టీ విజయం కోసం ఎలాంటి విధానాలు అనుసరించాలనే దానిపై సమాలోచలు సాగించినట్లు సమాచారం.
ఉప ఎన్నికలో లక్ష్యం చేరేందుకు అవసరమైన విధి విధానాల గురించి కూలంకశంగా చర్చించారు. బీజేపీలో ఈటలకు ఇచ్చే ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ తన గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా హోంక్వారంటైన్ లో ఉండడంతో హాజరు కాకపోయారు.