Errabelli Dayakar Rao: ప్రచారంలో జనం లేరు.. పాపం ఆ మంత్రి గారు

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గం లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 20, 2023 10:38 am
Follow us on

Errabelli Dayakar Rao: కొత్త పెళ్లికూతురు అందం.. పెళ్లికి ముందు దంచే పసుపుకొమ్ముల్లోనే కనిపిస్తుంది అంటారు పెద్దలు.. దీనిని వర్తమాన రాజకీయాలకు అన్వయిస్తే.. పోటీలో ఉన్న అభ్యర్థి సత్తా అతడి ప్రచారంలో ఉన్న జనాన్ని బట్టి తెలుస్తుంది.. అంటే ఇవాళ, రేపు ఎన్నికల ప్రచారంలో వచ్చేవారంతా కార్యకర్తలు కాదు కదా! అని మీరు అనుకోవచ్చు. కానీ అలాంటి వారు కూడా ఎన్నికల ప్రచారంలో లేకపోతే దాన్ని ఏమనుకోవాలి? ఎటువంటి సంకేతానికి కారణంగా భావించాలి? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే ఆ మంత్రిగారిని వేధిస్తున్నాయి. ఆయనేం ఆషామాసి వ్యక్తి కాదు. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి నేటి కేసిఆర్ హయాం వరకు ప్రజాప్రతినిధిగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఇలా బహువిధమైన పాత్రలు పోషించుకుంటూ మెప్పిస్తున్నారు. కానీ తాజాగా ఏం జరిగిందంటే?

జనం లేకపోవడంతో..

ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గం లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో అదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు.. ఇదే పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. ఆయనకు సమీప ప్రత్యర్థిగా అనుమాండ్ల యశస్విని రెడ్డి అనే యువతి ఉన్నారు. ఈమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

నువ్వా నేనా?

అయితే పాలకుర్తిలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే ఎర్రబెల్లి దయాకర్ రావు కి ఒకింత తలనొప్పిగా పరిణమించిందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితిని విషదీకరించే విధంగా ఇటీవల పలు సంఘటనలు జరిగాయి. తనకు ఓటు వేస్తేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అది మర్చిపోకముందే తొరూర్ పట్టణంలో ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్దగా జనం లేకపోవడం విస్తు గొలిపింది.. సాధారణంగా ఇలాంటి ప్రచార సమయంలో జన సమీకరణను నేతలు సవాల్ గా తీసుకుంటారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి సీనియర్ లీడర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ఇటీవల దయాకర్ రావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటర్లను ఉద్దేశించి పరుష పదజాలం వాడటం కూడా సంచలనం కలిగించింది. ఇలా వరుసగా ప్రతికూల సంఘటనలు జరుగుతుండడంతో ఆ మంత్రి గారి కేడర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. మరి ఎన్నికలకు ఇంకా పది రోజులు సమయం ఉన్నందున.. ఇటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారా? లేక కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తారా అనేది చూడాల్సి ఉంది.