Enforcement Directorate: అక్రమంగా డబ్బు సంపాదించేవారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరుపుతోంది. తెలంగాణలో కూడా అవినీతి పెరుగుతోందని, ఈడీ దాడులు తప్పవని విపక్ష నాయకులు కొన్ని రోజులుగా చెబుతున్నారు.. సీఎం కేసీఆర్ కూడా గతంలో ఓ ప్రెస్‌మీట్ ‘ నేను కేంద్రంతో కొట్లాడుతున్న.. నాతోపాటు, నాతో సన్నిహితంగా ఉండే వ్యాపారులపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తుంది. లెక్కలన్నీ సరిచేసుకోండి’ అని సూచించారు. వీరు చెప్పినట్లుగానే ఈడీ తెలంగాణలోకి ఎంటర్ అయింది. అవరుస దాడులతో అవినీతి అధికారులు, నేతలు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తి్తస్తోంది. ఎప్పుడు ఎవరిపై విరుచుకు పడుతుందో తెలియక అధికార టీఆర్‌ఎస్ పార్టీనేతలు, అనేతలతో సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు, వ్యాపారులు, రియల్టర్లు హడలిపోతున్నారు. కొంతమంది నేతల పంచెతు తడిసిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈడీ చుట్టూ రాజకీయాలు..
ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఈడీ చుట్టూ తిరుగుతోన్నాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. అంతకముందు ఆమె తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా ఐదు రోజులపాటు విచారణ చేసింది. దీనిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
స్తంభించిన పార్లమెంట్..
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింపజేశారు. ఈడీ అధికారులు చేస్తోన్న మెరుపుదాడులు, ఆకస్మిక సోదాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడుతోన్నాయి. కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రతిపక్ష సభ్యులతో జట్టు కట్టింది.
హైదరాబాద్‌లో మెరుపుదాడి..
పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ వంటి రాజకీయ నాయకుల నివాసాలపై దాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో ఈడీ అధికారులు మెరుపుదాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్ధరాత్రి ఈ దాడులు మొదలయ్యాయి. తార్నాకలోని ఇల్యాజ్ ఫారూఖీ అనే రైల్వే కాంట్రాక్టర్ నివాసంపై దాడులు చేశారు.
హర్యానా నుంచి..
కాంట్రాక్ట్ పనుల్లో రైల్వే మంత్రిత్వ శాఖను రూ.100 కోట్లు మోసగించారనే ఆరోపణలు ఇల్యాజ్ ఫారూఖీపై ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ గల వాహనంలో ఈడీ అధికారులు తార్నాక మర్రి చెన్నారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫారూఖీ నివాసానికి చేరుకున్నారు. ఆయన వ్యాపారాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. నగదు బదిలీలపై ఆరా తీశారు.
రాజకీయ పలుకుబడి ఉందా?
ఫారూఖీతోపాటు ఆయన కుటుంబ సభ్యులు రైల్వే కాంట్రాక్ట్ పనులను నిర్వహిస్తోన్నారని, కన్సల్టెన్సీ బిజినెస్‌లో కొనసాగుతున్నారని తేలింది. వివిధ రైల్వే జోన్ల నుంచి వంతెనల నిర్మాణం, పట్టాల నిర్వహణ వంటి కాంట్రాక్ట్ పనులను ఫారూఖీ పొందేవాడని తెలిసింది. కొన్ని నకిలీ బిల్లులను çసృష్టించి రైల్వే మంత్రిత్వ శాఖను రూ.100 కోట్ల మేర మోసగించినట్లు ఫిర్యాదులు అందడంతో ఈడీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు చెబుతున్నారు. ఫారూఖీ సోదరుడికి రాజకీయంగా పలుకుబడి ఉందని తెలుస్తోంది.
జాబితాలో ఇంకా ఎంతమందో…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కంటే ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని నరేంద్రమోదీతో పశ్చిమబెంగాళ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కొట్లాడుతున్నారు. ప్రధాని మోదీతో కొట్లాడినందుకే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మూడోసారి అధికారంలోకి వచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా మమతాబెనర్జీని అనుసరిస్తున్నారు. గతేడాది జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత నుంచి కేంద్రంపై పోరాటం ఉధృతం చేశారు. పశ్చిమబెంగాల్, ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులపై ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయడంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గారు. మంత్రుల అవినీతిని ఈడీ బయటపెట్టడంతో ఆ సీఎంలు అస్త్రసన్యాసం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం తాను ఎవరికీ బయపడ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇటీవలి ప్రెస్ మీట్‌లో ‘నాకు మనీ లేదు.. లాండరింగ్ లేదు.. కేసీఆర్ ఎవ్వనికీ భయపడడు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేసీర్ ధైర్యంగా కనిపిస్తున్నా.. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే వ్యాపారులు మాత్రం వణికిపోతున్నారు. కేంద్రం కూడా కేసీఆర్‌ను ముట్టుకోకుండా ఆయనకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న అవినీతిపనులను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. చూడాలి మరి ఈడీ దాడులు ఎంత వరకు వెళ్తాయో…