
Telangana Govt Teachers: తెలంగాణ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా ఊపింది. ఏళ్లుగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏళ్లుగా తెస్తున్న ఒత్తిడికి ఎట్టకేలకు బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ, ఈ ప్రక్రియ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జారీ చేసిన జీవో 317 ప్రకారం వేల మంది ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. స్పౌజ్ అవకాశం కూడా కొన్ని జిల్లాలకు కల్పించారు. తాజా బదిలీల ప్రక్రియకు వారు అడ్డుపడుతున్నారు. మరోవైపు 17 ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని భాషా పండితులు, పీఈటీలు కూడా తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకోవైపు బదిలీ, ప్రమోషన్ ఉత్తర్వుల్లో లోపాలపై కొంతమందికి అదనపుపాయింట్లు ఇవ్వడంపై మిగతా ఉపాధ్యాయులు కోర్టు తలుపు తడుతున్నారు. దీంతో బదిలీల పంచాయితీ ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు.
భాషా పండితులు, పీఈటీల ఆందోళన..
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల్లో భాషా పండితులు, పీఈటీలకు అవకాశం ఇవ్వలేదు. కోర్టు కేసు కారణంగా అవకాశం ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో తమకూ అవకాశం ఇవ్వాలని వారు ఆందోళన చేస్తున్నారు. 17 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతికి నోచుకోకుండా పనిచేస్తునానమని, ఇప్పటికే వేల మంది ప్రమోషన్ లేకుండానే రిటైర్ అయ్యారని పేర్కొంటున్నారు. గతంలో సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్ ఇవ్వకుంటే జాబ్‌చార్ట్ ప్రకారమే విధులు చేస్తామని, హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు బోధించమని పేర్కొంటున్నారు.
కోర్టుకు వెళ్లిన 317 బాధితులు..
మరోవైపు గతేడాది జారీ చేసిన 317 జీవోతో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు తాజా బదిలీల్లో అవకాశం ఇవ్వలేదు. దీంతో వాళ్లు కోర్టు తలుపు తట్టారు. తాము సీనియారిటీ నష్టపోకున్నా.. బదిలీల్లో అవకాశం కల్పించలేదని న్యాయస్థానానికి విన్నవించారు. ఇప్పటికే 317 జీవోతో నష్టపోతాయమని, స్పౌజ్ బదిలీలకు అవకాశం ఉన్నా ఇవ్వలేదని, తాజాగా బదిలీల్లో కూడా ఆప్షన్ లేకుండా చేశారని తెలిపారు. దీంతో తాజా బదిలీల్లో 317 జీవోతో బదిలీ అయిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఆప్షన్ ఇచ్చింది. ఈ పంచాయితీ ముగియగానే మరో వివాదం హైకోర్టుకు చేరింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నాన్ స్పౌజ్ టీచర్లు..
నాన్ స్పౌజ్ టీచర్ల తాజా బదిలీలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకునేందుకు పలు నిబంధనలు విధించింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో 317 జీవోతో ఇతర జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ అయిన టీచర్లు ఆందోళన బాటపట్టారు. తెలంగాణలో చివరిసారిగా 2015 జులైలో పదోన్నతులు, బదిలీలు రెండింటినీ ఒకేసారి జరిపింది. అయితే.. అప్పటి నుంచి మళ్లీ మధ్యలో ఇంకెప్పుడు వీటి జోలికి పోలేదు. మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియను సర్కారు చేపట్టింది. 2018లో కేవలం బదిలీలు మాత్రమే జరగగా.. ఇప్పుడు చేపట్టిన ప్రక్రియలో మొత్తం 9,700 మందికి పదోన్నతులతో పాటుగా సుమారు 30 వేల మంది ట్రాన్స్‌ఫర్ కానున్నారు. అయితే బదిలీల నిబంధనల్లో కొంతమందికి అదనపు పాయింట్లు ఇవ్వడంపై న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మార్చి 14కు విచారణ వాయిదా వేసింది.
ఇలా ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతలు ప్రక్రియకు రోజుకో ఆటంకం కలుగుతోంది. ఇలా అయితే ఈ పంచాయితీకి ఇప్పట్లో ఎండ్‌కార్డు పడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.