Employees Vs AP Govt: ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు చరిత్రలో లేవు. నాడు చంద్రబాబు ఇలానే 2004లో ఉద్యోగులతో పెట్టుకొని పదేళ్లు అధికారానికి దూరమయ్యాడు. అందుకే మరోసారి సీఎం కాగానే మొదట ఫిట్ మెంట్ లు, ప్రమోషన్లు, జీతాల పెంపుతో వారిని కూల్ చేశాడు. ప్రభుత్వ వ్యవస్థ నడవాలంటే ఉద్యోగులే కీలకం. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా వారి కోరికలు ముందు తీరుస్తారు. తమ పాలనను చక్కగా చేసుకుంటారు. జగన్ కూడా 2019 ఎన్నికల ముందర చాలా హామీలిచ్చారు. కానీ గద్దెనెక్కాక ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ జగన్ ఇచ్చిన హామీలేంటి? ఎందుకు నెరవేర్చలేదు.? ఉద్యోగుల ఆందోళనకు కారణం ఏంటన్నదానిపై స్పెషల్ ఫోకస్

ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడడం లేదు. రెండు వర్గాలూ పట్టు వీడడం లేదు. ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండగా.. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బతీయాలని ఉద్యోగులు నిర్ణయానికి వచ్చారు. వాస్తవాని జగన్ సర్కారుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఆయన అధికారంలోకి వస్తే తప్పకుండా సీపీఎస్ రద్దుచేస్తారని నమ్మారు. పీఆర్పీ, వేతన బకాయిలు ఇలా అన్నింటికీ పరిష్కార మార్గం దొరకుతుందని భావించి గత ఎన్నికల్లో మద్దతు తెలిపారు.కానీ అధికారంలోకి వచ్చిన తరువాడ జగన్ మడతపెచీ వేశారు. అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు. అప్పట్లో తెలియకుండా హామీ ఇచ్చానని కూడా చెప్పుకొచ్చారు. తమ ద్వారా రాజకీయ లబ్ధి పొందిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ముఖం చాటేసరికి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వీధుల్లోకి వచ్చి పోరాటం ప్రారంభించారు. ప్రభుత్వానికి బద్ధ శత్రువులుగా మారిపోయారు.
-2019కు ముందు జగన్ ఏ హామీలిచ్చారు
ఉద్యోగులకు వేతన సవరణ చేస్తానని.. సీపీఎస్ రద్దు చేస్తానని.. మధ్యంతర భృతి, ఫిట్ మెంట్, పీఆర్సీ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాగానే డీఏ ఇతర సౌకర్యాలు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్ఆర్ఏ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్కేల్, గ్రామ సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ స్కేలు, 2022 పీఆర్సీ స్కేళ్లు ఇవ్వడం.. రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తానని జగన్ హామీలిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఆర్థిక భారంతో వదిలేశారు.
-ఉద్యోగుల డిమాండ్లు ఏంటి?
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు. ఐఆర్ 27 శాతం ఉన్నందున ఫిట్ మెంట్ 30శాతం వరకూ ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు ఐఆర్ కన్నా ఫిట్ మెంట్ తగ్గడంపై అసంతృప్తిగా ఉన్నారు. 23శాతం ఫిట్ మెంట్ కు అంగీకరివద్దని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఫిట్ మెంట్ విషయంలో ఎలాంటి చర్చలకు చాన్స్ లేదని.. మార్చే అవకాశం లేదని తేల్చిచెబుతున్నారు. పీఆర్సీ పదేళ్ల వరకూ లేదని జగన్ సర్కార్ జీవో ఇవ్వడంతో ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐదేళ్లకోసారి రాష్ట్ర పీఆర్సీనే ఉండాలంటున్నారు. 2022 పీఆర్సీ స్కేళ్లు ఇవ్వడం.. రిటైర్డ్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
-ఆందోళన బాటలో ఉద్యోగులు..అణిచివేస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వం ఉద్యోగుల కోరికలు తీర్చకపోవడంతో విజయవాడ వేదికగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తలపెట్టిన మిలీనియం మార్చ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే అప్పటి నుంచే ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత బయటకు వచ్చింది. దానికి మిలీనియం మార్చే కారణమైంది. అప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ప్రభుత్వానికి వైరం ప్రారంభమైంది. సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం.. ప్రభుత్వం ముందస్తు నిర్బంధాలతో అణచివేయడం పరిపాటిగా మారింది.
-సజ్జల ఎందుకు పుల్లలు పెడుతున్నారు?
ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో సజ్జల రామక్రిష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించారు. చివరకు మంత్రులకు కూడా కాదని సీఎం జగన్ సజ్జలనే ప్రయోగించారు. కానీ సజ్జల మాత్రం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలకు ఎప్పటికప్పడు అడ్డు పుల్ల వేస్తూ వస్తున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ రద్దన్నది అసాధ్యం. ప్రతీ నెల జీతాలకే రుణాల కోసం వెతుకునే స్థితిలో ప్రభుత్వం ఉంది. ఒక వేళ ఉద్యోగుల డిమాండ్లను సమ్మతిస్తే మాత్రం తాము నమ్ముకున్న సంక్షేమ పాలనకు ఇబ్బందులు తప్పవు. అందుకే జగన్ ఎప్పటికప్పుడు సజ్జల ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులను అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. అయితే ఒకానొక దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సజ్జల ఏ హోదాలో చర్చిస్తున్నారన్న ప్రశ్న కూడా వచ్చింది. కానీ సీఎం జగన్ ఏమీ పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు సజ్జల ద్వారా అడ్డుపుల్లలు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విషయంలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తమకు ఉద్యోగ సంఘాల నేతలెవరూ తెలియదని.. వారితో పెద్దగా పరిచయం కూడా లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కారు ఉద్యోగులందర్నీ ఒకే మాదిరిగా చూస్తుందని.. ఇందులో ఎటువంటి వివక్ష చూపదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుడిగా మాజీ ఎన్టీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పేరును ప్రకటించారు. సచివాలయంలో ఉద్యోగుల మధ్య ఈ విషయాన్ని వెల్లడించారు. అవకాశం వచ్చింది కదా అని పనిలో పనిగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నంచేశారు. కానీ గత నాలుగేళ్ల కాలంలో పాలనా వ్యవహారంలో సజ్జలదే కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం నియమించిన ప్రతీ కమిటీలో ఆయనున్నారు. ఆయనకు తెలియకుండా ప్రభుత్వంలో ఆకు కూడా అల్లాడదు. అటువంటి వ్యక్తి తనకు ఉద్యోగ సంఘాల నేతలెవరూ తెలియదని చెప్పడంతో అక్కడున్న ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు.

-ఉద్యోగులు ఎందుకు సంతృప్తిగా లేరు
వాస్తవానికి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగులపై బలవంతంగా రుద్దుతున్నారన్న టాక్ అయితే ఉంది. చాలా మంది ఉద్యోగ సంఘ నాయకులతో చంద్రశేఖర్ రెడ్డికి పడదు. ఈ పరిస్థితుల్లో ఆయన నియామకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సజ్జల ఎంటరయ్యారు. దీనికి ఒక ఫుల్ స్టాప్ చెప్పేందుకు ప్రయత్నించారు. వైసీపీ సర్కారు ఉద్యోగ సంఘ నేతలను చేరదీసి.. ఉద్యోగులను ఎప్పుడూ దూరం చేసుకోదని చెప్పడం ద్వారా వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. . అసలు ఉద్యోగులకు రాజకీయాలతో పనేమిటని ప్రశ్నించారు. మేం చేయలేని పనులు కూడా ఉద్యోగులతో చేయించుకుంటామని కూడా వారికి స్వాంతన కలిగేలా కామెంట్స్ చేశారు. అయితే ఏపీలో రాజకీయాల కోసం ఉద్యోగులను వాడుకున్నది జగన్. వారిలో లేనిపోని ఆశలు కల్పించిందీ ఆయనే. ఇప్పుడు ఉద్యోగులకు రాజకీయాలెందుకు? అనడంపై అదే ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.