Pawan Kalyan- Modi: ప్రధాని మోదీతో పవన్ భేటీ తరువాత ఏపీ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు ప్రారంభమయ్యాయి. అసలు ప్రధానితో పవన్ ఏం చర్చించారన్న దానిపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. అప్పటి వరకూ జగన్ ను అధికారం దూరం చేయాలన్న అజెండాతోనే పవన్ ముందుకెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పడం ద్వారా టీడీపీతో జనసేన పొత్తు ఖాయమన్న సంకేతాలు పంపించారు. కానీ ప్రధానితో భేటీ తరువాత రూటు మార్చారు. పొత్తుతో మహా అయితే జగన్ ను పవర్ నుంచి దూరం చేయవచ్చు కానీ.. తాను సీఎం అయ్యే మార్గం లేదని పవన్ తెలుసుకున్నట్టున్నారు. అందుకే స్ట్రాటజీని మార్చేశారు. తనకు వన్ చాన్సివ్వాలని ప్రజలకు నేరుగా అభ్యర్థించడం ప్రారంభించారు. అయితే పవన్ లో సడెన్ మార్పునకు మాత్రం ప్రధానితో భేటీయే కారణమని అటు జనసేన, ఇటు బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతకు ముందు వరకూ టీడీపీ, జనసేన మధ్య ఉన్న సానుకూల వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది.

విశాఖ ఎపిసోడ్ తరువాత పవన్ బస చేసిన హోటల్ ను వెతుక్కుంటు మరీ చంద్రబాబు వెళ్లారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరం కలిసి పోరాటం చేద్దామంటూ ప్రతిపాదనను పెట్టారు. దీంతో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ ప్రధాని పర్యటనతో మొత్తం స్వరూపమే మారిపోయింది. టీడీపీతో తాము ఎట్టి పరిస్థితుల్లో కలవమని కాషాయ దళం చెబుతోంది. అటు పవన్ తో ప్రధాని కొన్ని విషయాలు షేర్ చేసుకున్న తరువాత జనసేనానిలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. టీడీపీ తో కలిసి వెళితే మహా అయితే చంద్రబాబు సీఎం అవుతారని.. జనసేనకు సీట్లు పెరగుతాయని.. అదే బీజేపీతో కలిసి నడిస్తే మాత్రం పవన్ సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశముందని బీజేపీ నేతలు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే పవన్ విషయంలో బీజేపీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు సీఎం క్యాండిడేట్ ప్రకటన బీజేపీలో లేదు. కానీ ఏపీలో భిన్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ కాస్తా మినహాయింపును ఇచ్చే అవకాశముంది. రెండు పార్టీల ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా పవన్ ను ప్రకటించడానికి బీజేపీ అగ్రనేతలు సైతం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. భవిష్యత్ లో ఈ కూటమే ఏపీలో ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఇదే విషయంపై ప్రధాని మోదీ క్లారిటీ ఇవ్వడంతో పవన్ సైతం టీడీపీ వైపు చూడడం తగ్గించేశారు. ముందుగా బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలని.. రెండు పార్టీలు బలపడితే.. ఇతర పార్టీల నుంచి చేరికలు పెరిగే అవకాశముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ విషయంలో పవన్ మనసు మార్చుకున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రధాని మోదీతో భేటీ తరువాత పవన్ వరుస ట్విట్లు చేశారు. ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ దిశ నిర్దేశం చేయడం, అవి నచ్చడంతోనే పవన్ రూటు మార్చారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం.. అదే బీజేపీతో కలిస్తే పవన్ సీఎం అవుతారని రాష్ట్ర బీజేపీ నేతలు పదేపదే చెబుతూ వస్తున్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. అయితే ప్రధానితో భేటీ తరువాత పవన్ కూడా దీనిపై క్లీయర్ కట్ గా ఒక పిక్చర్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే విజయనగరం పర్యటనలో పవన్ అటువంటి సంకేతాలిస్తూనే మాట్లాడారు. అయితే పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్రకటిస్తారో చూడాలి మరీ. ప్రభుత్వ ఓటు చీలిపోనివ్వనన్న కామెంట్స్ తో టీడీపీతో కలిసి నడుస్తారా? తనను సీఎం క్యాండిడేట్ గా మద్దతు తెలిపే బీజేపీ వెంట నడుస్తారా అన్నది కొద్దిరోజుల్లో తేలనుంది.