Homeజాతీయ వార్తలుNitish Kumar - KCR: మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో దోస్తీ నితీశ్‌కు ఇష్టం లేదా?.. ...

Nitish Kumar – KCR: మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో దోస్తీ నితీశ్‌కు ఇష్టం లేదా?.. కేసీఆర్ తో మింగుడుపడని నితీష్.. బీహార్ లో గులాబీ దళపతికి అవమానం?

Nitish Kumar – KCR: జాతీయ రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇస్తున్న కేసీఆర్‌.. కొన్నిరోజులు ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ వెళ్లాచ్చారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా కొద్దిరోజులు మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం అనుకూల రోజులుగా భావించి మళ్లీ దేశయాత్ర మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో బీజేపీ పతనమే లక్ష్యంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ను కలిసేందుకు కేసీఆర్‌ బుధవారం బీహార్‌ వెళ్లారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి సీఎం నితీశ్‌ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. దీనిపై బీజేపీ నేతలు ఓ రేంజ్‌ లోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ వీడియో వైరల్ కారణం అవటానికి గల కారణాలు చూస్తే…

Nitish Kumar - KCR
Nitish Kumar – KCR

-పొత్తులపై ఆసక్తికర ఘటన..
పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 ఎన్నికల్లో పొత్తులు, ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో కేసీఆర్, నితీశ్‌ కుమార్‌ మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సీన్‌… వైరల్‌ గా మారింది. దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల పొత్తు, కాంగ్రెస్‌ భాగస్వామ్యం, రాహుల్‌ ప్రధాని అభ్యర్థి గురించి కేసీఆర్‌ను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. జవాబు ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్న క్రమంలో… నితీశ్‌కుమార్‌ అలాంటి ప్రశ్నలకు జవాబులు వద్దు అంటూ కేసీఆర్‌ను కోరారు. ఇదే వేదికపై డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌ కూడా ఉన్నారు. విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిశ్‌కుమార్‌ పేరుపై అభిప్రాయాన్ని చెప్పాలని కేసీఆర్‌ ను మీడియా ప్రతినిధులు అడిగారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌…. ‘ఇది చెప్పడానికి నేను ఎవరు..? నేను సమాధానం ఇస్తే ఇతర పక్షాలు అభ్యంతరం చెప్పొచ్చు. మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? కూర్చొండి దీనిపై మాట్లాడుకుందాం అంటూ జవాబునిచ్చారు’ ఇదే సమయంలో నితీశ్‌కుమార్‌ ఆయన సీట్లో నుంచి లేచి మీడియా సమావేశం ముగిసినట్లు సంకేతాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌ కూడా లేచి నిలబడ్డారు. అయితే కేసీఆర్‌ మాత్రం… నితీశ్‌ చేయి పట్టుకుని వారించారు. నేను కూర్చున్నాను.. మీరు కూడా కూర్చొండి అంటూ బతిమిలాడారు కేసీఆర్‌. కానీ కేసీఆర్ తో కలిసి మీడియా సమావేశంలో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నితీష్ వెనుకాడారు.

-రాహుల్‌ను ప్రధానిగా ప్రకటిస్తారా?
రాహుల్‌ గాంధీని ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తాయా అని అడిగిన ప్రశ్నకు కేసీఆర్‌ బదులిస్తుండగా.. నితీశ్‌ కుమార్‌.. మరోసారి పైకిలేచారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తామని కేసీఆర్‌ అన్నారు. దీనిపై కూర్చుని చర్చిస్తామని…. ఏకాభిప్రాయంతో ఏం నిర్ణయం తీసుకున్నా పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ‘బ్రాహ్మణుడు లేకుండా పెళ్లి జరగదు.. మీరు(మీడియా) లేకుండా కూడా ఏమీ జరగదు’ అంటూ కేసీఆర్‌ చమత్కరించారు.

-వెళ్లిపోదామన్నా వినని కేసీఆర్‌..
మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలు అడుగుతుండగా… నితీశ్‌కుమార్‌ మళ్లీ కుర్చీలో నుంచి లేచారు. కేసీఆర్‌ను కూడా వెళ్దామంటూ వారించారు. అయితే కేసీఆర్‌ మాత్రం కూర్చొండి అంటూ చేయి పట్టుకుని కోరుతూ వచ్చారు. నిలబడే ఉన్న నితీశ్‌ చివర్లో…‘వారి ట్రాప్‌లో పడొద్దు’ అంటూ కేసీఆర్‌ ను ఉద్దేశిస్తూ నవ్వుతూ కామెంట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ తెగ వైరల్‌ అవుతోంది.

వీడియోను ట్రోల్‌ చేస్తున్న బీజేపీ నేతలు..
ఇక ఈ వీడియోను బిహార్‌ బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రెస్‌ మీట్‌ చూడలేదని.. కేసీఆర్‌ను నితీశ్‌ కుమార్‌ అవమానించారంటూ బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌కు అవమానం జరిగిందంటూ మరో బీజేపీ నేత అమిత్‌ మాల్వియా కూడా కామెంట్‌ చేశారు. ఇలాంటి అవమానం కోసమే కేసీఆర్‌ పాట్నాకు వెళ్లారా అంటూ ప్రశ్నించారు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం పూర్తి చేసేలా కేసీఆర్‌కు సమయం ఇవ్వలేదని, నితీశ్‌ కుమార్‌ కనీస మర్యాద ఇవ్వలేదని రాసుకొచ్చారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా తనపేరుకు ఆమోదం తెలుపుతారని కేసీఆర్‌ను నితీశ్‌ బిహార్‌ కు రప్పించారని సుశీల్‌ మోదీ విమర్శించారు. కానీ కేసీఆర్‌ అలా చేయకపోవటంతో… వేదికపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారని సెటైర్లు విసిరారు.

Nitish Kumar - KCR
Nitish Kumar – KCR

-మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఇష్టం లేదా..
ఇక బిహార్‌లో జరిగిన తెలంగాణ, బిహార్‌ ముఖ్యమంత్రుల సమావేశం వీడియోపై తెలంగాణ రాజకీయ విశ్లేషకులు వివిధ రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. నితీశ్‌కుమార్‌ తనను 2024 నాటికి ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కేసీఆర్‌తో ప్రకటన చేయించేందుకు వీడియా ప్రతినిధులతో ప్రశ్న అడిగించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అయితే నితీశ్‌ ఆశించిన సమాధానం కేసీఆర్‌ నుంచి రాకపోగా, ‘నేను అది చెబితే మిగతా పక్షాలు వ్యతిరేకించొచ్చు’ అని వ్యాఖ్యానించడంతో బీహార్‌ సీఎంకు ఎక్కడో కాలినంత పనైందని పేర్కొంటున్నారు. అందుకే మీడియా సమావేశం అర్ధంతరంగా ముగించే ప్రయత్నం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొందరు.. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడం, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇష్టం లేక.. కేసీఆర్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న తీరు నచ్చకపోవడంతో ప్రెస్‌మీట్‌ నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేసి ఉండవచ్చని పేర్కొంటున్నారు. తన పేరు కాకుండా కేసీఆర్‌ విపక్షాల్లో వేరెవరిపేరైనా చెబుతారేమోనన్న ఆందోళనతో కూడా నితీశ్‌ ప్రెస్‌మీట్‌ ముగించే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది మేమైనా.. బీహార్‌లో కేసీఆర్‌ పర్యటన, ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్త ప్రెస్‌మీట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

దీన్ని బట్టి మోడీకి వ్యతిరేకంగా సాగడానికి నితీష్ కుమార్ కు ఇష్టం లేదన్నట్టుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో వీళ్లు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్, నితీష్ ఇద్దరూ ప్రధాని మోడీ చెప్పినట్టు నడుస్తున్నారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. బీజేపీ ఆడిస్తున్న ఆటలో కేసీఆర్, నితీష్ కూడా భాగమని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ కు, రాహుల్ ను ప్రధానిగా ప్రకటించడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా.. కేసీఆర్ టూర్ లో మాత్రం బీహార్ సీఎం నితీశ్ అంత సంతృప్తిగా లేరని.. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరలేదని వారి ప్రవర్తనను బట్టి తెలుస్తోంది

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version