electricity charges hike: తెలంగాణ ప్రజలకు ‘షాక్’ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు చార్జీల పెంపుపై డిస్కమ్ లు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారీగానే ధరలభారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడిప్పుడే.. కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతలో కొంత బయటపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కారు సైతం తన ఆర్థిక పరిస్థితులను గట్టెక్కించుకునేందుకు ప్రజలపై భారం మోపేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్,నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటగా.. నేడో రేపో ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం అయ్యాయి. ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపితే.. బస్సు ప్రయాణం పేదల ప్రజలకు భారంగా మారనుంది. ఇదే క్రమంలో విద్యుత్ బిల్లులు కూడా పెంచాలని సర్కారు ఆలోచన చేస్తోంది. విద్యుత్ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని.. గత ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలు ఒక్కపైసా కూడా పెంచకపోవడంతో నష్టాలతో పాటు.. ఆర్థిక లోటు పెరిగిపోయిందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సర్కారుకు నివేదిక అందించింది.
గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. శ్లాబుల వారీగా పెంపు వివరాలను వెబ్ సైట్ లో పెట్టనున్నారు. హెచ్.టీ వినియోగదారులకు యూనిట్ కు రూపాయి పెంపునకు ప్రతిపాదించారు. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6831 కోట్ల ఆదాయం రానుంది.
విద్యుత్ చార్జీలు పెంచిన పేరే తప్పా.. ఆర్థికంగా జరిగే నష్టాలను ఏ మాత్రం పూడ్చే అవకాశం ఉండదని విద్యుత్ సంస్థ భావించింది. ప్రస్తుత ఏడాదితో పాటు వచ్చే ఏడాది కలిపి రూ.21,552 వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని.. వీటితో పాటు ఏడాదికి రూ.6వేల కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తోందని వివరించింది. రాష్ట్రంలో ఏటా నాలుగువేల కోట్ల యూనిట్ల విద్యుత్ ను ప్రజలకు విక్రయిస్తుండగా.. యూనిట్ కు సగటున రూపాయి చొప్పున పెంచితే రూ.4వేల కోట్ల ఆదాయం ఏటా పెరుగుతుంది. ప్రస్తుత చార్జీలు కొనసాగిస్తే.. 10వేల కోట్ల లోటు ఉంటంది.యూనిట్ కు రూపాయి చొప్పున పెంచినా. మరో రూ.6వేల కోట్ల లోటు ఉంటుంది.