election commission of india : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ దూసుకుపోతోంది. బిజెపి నేతృత్వంలోని మిత్రపక్షాలు భారీ మెజారిటీ దిశగా పయనిస్తున్నాయి. కొద్దిసేపటి కిందటే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది మొత్తం 288 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ రెండు రోజుల కిందట ముగిసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 145. కానీ ఆధిక్యతలో ఆ ఫిగర్ దాటేసింది బిజెపి నేతృత్వంలోని మిత్రపక్షాలు. ఎగ్జిట్ పోల్స్ కూడా బిజెపి మిత్రపక్షాలకు జై కొట్టాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బిజెపి, అజిత్ పవర్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మహాయూటీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఆ కూటమి 147 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. మొన్నటి వరకు ఇక్కడ మహాయూటి ప్రభుత్వమే కొనసాగింది. ఈ ఎన్నికల్లో ఆ కూటమికి దెబ్బ తప్పదని అంతా భావించారు. కానీ ఏక్ నాథ్ షిండే బాగా పాలించారన్న పేరు తెచ్చుకున్నారు. ఈ తరుణంలోనే సానుకూల వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా బిజెపి జారవిడుచుకోలేదు.
* పవన్ ప్రచారం
అయితే ఇప్పుడు అందరి దృష్టి పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల పైనే ఉంది. అయితే ఫలితాల్లో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. కొద్దిరోజులపాటు ఎన్డీఏకు మద్దతుగా పవన్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన రెండు రోజులపాటు రోడ్డు షోలు, బహిరంగ సభలో పాల్గొన్నారు. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, డెగ్లూర్, సోలాపూర్, లూథూర్ లో పవన్ ప్రచారం చేశారు. అక్కడ ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
* బిజెపికి బలమైన మిత్రుడు
పవన్ బిజెపికి బలమైన మిత్రుడిగా మారారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే మాత్రం పవన్ కు మరింత ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల బిజెపి బాధ్యతలను ఆయనకు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో కూడా పవన్ తిరుగులేని శక్తిగా మారనున్నారు. మొత్తానికైతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల పుణ్యమా అని జాతీయస్థాయిలో కూడా.. పవన్ మరింత ప్రాధాన్యత దక్కించుకోవడం విశేషం.