Election Fever In Telangana: తెలంగాణలో మరో ఐదు నెలల్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం మగియబోతోంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేసేసి.. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇతర పార్టీలు కూడా అదే దశగా ఉన్నాయి. షర్మిల కూడా .. ఏదో ఓ పార్టీతో జత కట్టాలని చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఫీల్డ్ లోకి దిగే ముందు.. ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హ్యాట్రిక్‌పై కేసీఆర్ నజర్..
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన లెక్క వందకు తగ్గట్లేదు. అలాగని నిర్లక్ష్యం చేయడం లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలను ఇందుకోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
కాంగ్రెస్‌లో జోష్..
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక రేసులోకి వచ్చింది. ఆయనకు దీటైన నేతలం అని చెప్పుకునేందుకు ఇతర సీనియర్లు పాదయాత్రలు.. ఇతర పనులు చేపట్టడం ఆ పార్టీకి ప్లస్ అనుకోవాలి. ఈ క్రమంలో కర్ణాటకలో గెలవడం అడ్వాంటేజ్ అయింది. కర్ణాటక రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో పట్టు బిగించే పనిలో రేవంత్ ఉన్నారు. పార్టీ వీడిన నేతలను తిరిగి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ డీలా..
కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి. చేరిన నేతలు కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మళ్లీ పుంజుకోవడానికి బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయిలో మన్‌కీబాత్ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక సిద్దం చేసింది. మరోవైపు కోవర్టులకు చెక్ పెట్టడంపై అధిష్టానం దృష్టిపెట్టింది.
లిక్కర్ స్కాంపై ఒత్తిడి…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ కాకపోవడంతో .. ఆ ప్రభావం పార్టీపై ఉందని.. బీజేపీ నేతలు.. హైకమాండ్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయో లేదో స్పష్టత లేదు. ఏదో ఓ చర్య తీసుకోకపోతే.. బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది అని కమలనాథులు భావిస్తున్నారు.
అంతిమంగా ఎన్నికలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను రాజకీయ పార్టీలు రెడీ చేసుకున్నాయి. మరో నెల తర్వాత అందరూ ప్రచార బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.