Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం కాక రేపుతోంది. తొలుత కేటాయించిన గుర్తు మార్చడంపై స్వతంత్ర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించింది. యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఓట్లు చీల్చేందుకు ఈసీపై ఓత్తిడి చేస్తోందని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, రోడ్డు రోలర్ గుర్తు మునుగోడు రిటర్నింగ్ అధికారికి ఎసరు తెచ్చింది.

ఢిల్లీకి చేరిన పంచాయితీ..
స్వతంత్ర అభ్యర్థుల ఫిర్యాదుతో మునుగోడు ఉప ఎన్నికలో గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. తొలుత రోడ్‌రోలర్ కేటాయించి ఆ తర్వాత గుర్తు మార్చారని యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. రోడ్‌రోలర్ కేటాయిస్తూ ఆర్వో సంతకం చేసిన కాపీని ఫిర్యాదుకు జతచేసినట్టు సమాచారం. మరో స్వతంత్ర అభ్యర్థి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి పోటీ చేస్తున్న జానయ్య గుర్తుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈసీ అధికారులు ఆ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితోపాటు ఆర్వోను ఆదేశించింది. యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్‌కు తిరిగి రోడ్ రోలర్‌గుర్తు కేటాయించడంతోపాటు తన పరిధిలో లేని అధికారాలను గుర్తుల కేటాయింపు విషయంలో వినియోగించిన ఆర్వోపై చర్యలకు ఆదేశించింది.
గుర్తు మార్పుపై టీఆర్‌ఎస్ నేతల ఒత్తిడి…
యుగతులసీ పార్టీకి తొలుత రోడ్‌రోలర్ కేటాయించి తర్వాత తొలగించడాన్ని ఆ పార్టీ అభ్యర్థి శివకుమార్ తప్పుబట్టారు. ఎన్నికల అధికారుల్లో కొందరు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. రోడ్ రోలర్ గుర్తునే తిరిగి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తన కార్యాలయానికి వచ్చి రోడ్‌రోలర్ గుర్తును వదులుకోవాలని ప్రలోభపెట్టారని శివకుమార్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ ఈసీని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ ఓట్లను చీల్చేందుకు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కుట్రపూరితంగా కేటాయించిందని ఆరోపించారు. గుర్తుల కేటాయింపులో డీఈఓ, ఆర్వో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోపాటు సీఈసీకి ఫిర్యాదు చేశారు. తక్షణం వారిద్దరిని విధుల నుంచి తప్పించి, ఇతరులను నియమించాలని రాష్ట్ర ముఖ్యనేత ఒకరు అమిత్‌షాను కోరారు.

రిటర్నింగ్ అధికారిపై వేటు..
మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తు మార్చడంపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు వేసింది. యుగ తులసి పార్టీకి సంబంధించి డ్రాలో వచ్చిన రోడ్డు రోలర్ గుర్తును తొలగించి బేబీ వాకర్ గుర్తు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ని అధికారి విషయంలో నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందో వివరణ తీసుకొని నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించింది.
కొత్త రిటర్నింగ్ అధికారి కోసం మూడు పేర్లు..
ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరిగినా సహించబోమని స్పష్టం చేయడంలో భాగంగా పార్టీ గుర్తును తనకు లేని అధికారాలతో మార్చినటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త రిటర్నింగ్ అధికారి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపించారు. దీంతో సాయంత్రంలోగా ముగ్గురిలో ఒకరిని కొత్త రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.