Chikoti Praveen క్యాసినో నిర్వాహకుడు చీకోడి ప్రవీణ్ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఈడీ విచారణలో నేపాల్ క్యాసినో ఈవెంట్ లో బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన 10 మంది ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వారితోనే ప్రమోషన్ వీడియోలు కూడా చేయించినట్లు.. సినీ సెలబ్రెటీలతో జరిగిన ఆర్థిక లావాదేవీలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. చీకోడి క్యాసినో స్కాంలో ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్లు ఉన్నట్లు ఈడీ నిగ్గుతేల్చినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన మంత్రితోపాటు , ఏపీ మాజీ మంత్రితో లింకులు ఉన్నట్లు సమాచారం.
ఇక నేపాల్ వెళ్లి మరీ క్యాసినో ఆడిన వారిలో 16మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ప్రవీణ్ ల్యాప్ ట్యాప్ లో వీఐపీల బాగోతాలన్నీ ఉన్నట్లు సమాచారం. ప్రముఖులతో కలిసి ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ లో అడ్డాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కోల్ కతా మీదుగా నేపాల్ కు కస్టమర్లను చీకోటి ప్రవీణ్ తరలించేవాడని ఈడీ తేల్చింది. ఒక్కో ప్రైవేటు విమానానికి 50 లక్షలు చెల్లింపు చేసినట్లు గుర్తించారు. ఇక ఒక్కో హోటల్ కు 40 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇక కస్టమర్ల నుంచి 5 లక్షలు వసూలు చేసినట్లు, ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు ఏకంగా 200 మంది ఉన్నట్లు గుర్తించారు.
ఏపీలో వెలుగుచూసిన క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తికి ఈడీ నోటీసులు పంపడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈడీ విచారణకు హాజరైన ప్రవీణ్ తాజాగా తన వ్యాపారాలపై నోరువిప్పాడు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. రేపు ఈడీకి సమాధానం చెబుతానంటూ మీడియాకు తెలిపారు.గోవా, నేపాల్ క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని ప్రవీణ్ స్పష్టం చేశారు.
క్యాసినోలలో టాలీవుడ్, బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు ఉండడంతో ఫెమా కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పుడు చీకోటితో సహా వీరిందరి జాతకాలు బయటపెట్టేందుకు రెడీ అయ్యింది.