E.D Raids- KCR: రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకుల్లో ఈడి దడ మొదలైంది.. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు దూకుడు పెంచడంతో ప్రజాప్రతినిధులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్ర అధినాయకత్వం హెచ్చరికల మేరకు ప్రజాప్రతినిధులు ఎక్కువగా ప్రజల్లోకి రావడం లేదు. క్యాంపు ఆఫీసుల్లో కూడా కొంతమందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఏమైనా పంచాయితీలు గట్రా వస్తే పోలీసు స్టేషన్ కి వెళ్లాలని, తమ వద్దకు రావద్దని సూచిస్తున్నారు. ఫోన్లో కూడా ఎక్కువ మాట్లాడటం లేదు. తమ వ్యక్తిగత కార్యదర్శులను ఇతర ప్రాంతాలకు పంపించారు. బంధువులను కూడా దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే భయం భయంగా బతుకుతున్నారు.

ఫోకస్ చేసింది
ఒక్కొక్కరిగా మంత్రులను టార్గెట్ చేసి ఈడి, ఐటి దాడులతో వణుకు పుట్టిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న, ముఖ్యమంత్రికి వెన్నుదన్ను అందిస్తున్న మరికొందరు రాజకీయ నాయకుల పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. ఇక వారందరూ ఇప్పటినుంచే ఒకవేళ తమ సంస్థల్లో సోదాలు జరిగితే తప్పించుకోవడం ఎలా? తట్టుకోవడం ఎలా? అనేదానిపై దృష్టి సారించినట్టు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యంగా 11 మందిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫోకస్ చేసినట్టు సమాచారం.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతమంది నాయకులు, ఎంత డబ్బులు సంపాదించారు? వేల కోట్ల వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు? సీఎం కేసీఆర్ ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయి వంటి అన్ని సమాచారాలను ఈ డీ, ఐటి, సిబిఐ బృందాలు వారి పైన ప్రధానంగా దృష్టి సారించాయి. వీరి వ్యవహారాల్లో ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి, వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది..
వీళ్లకు మూడినట్టేనా
తెలంగాణ రాష్ట్రంలో క్యాసినో వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సోదరులు, గ్రానైట్ వ్యవహారంలో మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తాజాగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ని టార్గెట్ చేసి దాడులు చేసి దర్యాప్తు చేస్తున్న కేంద్ర సంస్థలు.. మరో 9 మంది పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, ఆశన్న గారి జీవన్ రెడ్డి.. వీరందరిపై కేంద్ర దర్యాప్తు బృందాలు దాడులు చేస్తాయని భావిస్తున్నారు. వీరు కొంతకాలం నుంచి వివాదాస్పద విషయాల్లో తల దూరుస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది.

కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారు
ఇటీవల టిఆర్ఎస్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగినప్పుడు ముఖ్యమంత్రి వీరందరినీ ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వీరు పలు వివాదాల్లో తల దూర్చారు. కొన్ని విషయాల్లో కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ మంత్రులు ఎంత మేర లావాదేవీలు నిర్వహించారు? వీరికి ఉన్న బ్యాంకు ఖాతాలు ఎన్ని? వీరికి ఎవరెఎవరు బినామీలుగా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వీరి ఆస్తులన్నీ? వచ్చిన తర్వాత ఎంత మేర కూడ పెట్టారు? ఈ విషయాలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందాల దగ్గర పొట్టి ఆధారాలు ఉన్నట్టు సమాచారం. రేపో, మాపో వీరిపై కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గత కొద్ది కాలం నుంచి బిజెపిని బహిరంగంగా విమర్శిస్తున్న కేసీఆర్.. ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకే కేంద్ర దర్యాప్తు బృందాలు తనిఖీలను వేగవంతం చేశాయని వినికిడి.