Economic Survey : భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన 2025 ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యూహానికి సంబంధించి కీలక సూచనలను అందించింది. ముఖ్యంగా 2030 నాటికి ఏటా 78.5 లక్షల కొత్త వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టించాలని సర్వే స్పష్టం చేసింది. నిరుద్యోగాన్ని తగ్గించడానికి, వ్యవసాయం నుండి పరిశ్రమలు, సేవల రంగాలకు యువత మారేలా ప్రోత్సహించాలనే అక్కరను హైలైట్ చేసింది.
ఉద్యోగ కల్పనపై కీలక ఫోకస్
ఆర్థిక సర్వే ప్రకారం.. యువతను ఉత్పాదకంగా మార్చడం దేశ ఆర్థిక విజయానికి కీలకం. భారత్ యువజన శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంటే ఆర్థిక వృద్ధి వేగంగా పెరుగుతుందని నివేదిక చెబుతోంది. నాణ్యమైన విద్య, స్కిల్ డెవలప్‌మెంట్, రీ-స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని సూచించింది. అదే విధంగా, వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన విధానాలు అమలు చేయడం ద్వారా కంపెనీలకు మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశమిస్తుందని పేర్కొంది.
జనాభా ప్రయోజనం
ఆర్థిక సర్వే హెచ్చరించిన మరో కీలక అంశం – జనాభా ప్రయోజనాన్ని (Demographic Dividend) సద్వినియోగం చేసుకోవడం. ప్రభుత్వ విధానాలు సరైన దిశలో లేకపోతే, నిరుద్యోగం పెరిగి, జనాభా ప్రయోజనం ఓ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వేగంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని, లేదంటే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
2025-26లో వృద్ధి 6.3% – 6.8%
ఆర్థిక సర్వే ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని అంచనా. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి 6.4%కు పడిపోవచ్చని హెచ్చరిక. గత ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి నమోదు కాగా, తాజా గణాంకాలు మందగమన సంకేతాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.
నిరుద్యోగంపై రేపటి బడ్జెట్ కీలకం
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈసారి బడ్జెట్‌లో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో నాలుగు సంవత్సరాల ఆర్థిక దిశను నిర్ణయించే కీలక బడ్జెట్ రేపటికి సిద్ధమవుతోంది. ఉద్యోగ సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశముందని అర్థవేత్తలు చెబుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు దిశను ఈ ఆర్థిక సర్వే స్పష్టంగా చూపిస్తోంది. యువతకు ఉద్యోగాలు, సరైన విధానాలతో జనాభా ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటే, దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందగలదని సర్వే తేల్చి చెప్పింది.