
Economic situation of Telangana : ‘మనది బంగారు తెలంగాణ. దేశానికే అన్నం పెడుతున్నాం. మన దక్కర పైసలకు కొదవ లేదు. ఏమైనా చేస్తాం. ఏదైనా చేస్తాం’. ఇలా ఉంటాయి కేసీఆర్ మాటలు. ఇక ముఖ్యమైన మంత్రి కేటీఆర్, విత్త మంత్రి హరీష్‌రావు చెప్పే వాటికైతే అంతూ పొంతూ ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందీ అంటే.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావు. సప్లమెంటరీ బిల్లులకు దిక్కూమొక్కూ ఉండదు. పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లకు బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. పైగా సర్పంచ్‌లు ఆందోళన చేస్తే వారిపై వేధింపులు.. పార్టీ నుంచి బహిష్కరణలు! ఇలా సాగుతోంది బంగారు తెలంగాణలో.. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు..
25 వేల కోట్లు అవసరం
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు. జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు తాయిలాలు ప్రకటించడం అధికార పార్టీకి సర్వసాధారణం. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా ప్రకటిచింది. అంతే కాదు ప్రవేశపెట్టి బడ్జెట్ కూడా అంకెల కోటలు దాటింది. కానీ తరచి చూస్తే ఏముంది? బభ్రజమానం, భజ గోవిందం. ఇప్పటికిప్పుడు తెలంగాణ అసవరాలు తీరాలంటే తక్కువలో తక్కువ రూ.25 వేల కోట్లు అవసరం. వచ్చే రాకట లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
ఏ నెల సొమ్ము ఆ నెలలో కరిగిపోతోంది
ప్రస్తుతానికైతే ప్రభుత్వానికి పన్నులు, సుంకాలు వంటి రాష్ట్ర రాబడులు, కేంద్ర గ్రాంట్లు, అప్పుల రూపంలో ప్రభుత్వానికి ప్రతినెలా రూ. 16 వేల కోట్ల వరకు సమకూరుతున్నాయి. కానీ, అసలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, ఉద్యోగుల జీత భత్యాలు, కొన్ని సంక్షేమ పథకాలకు నెలకు రూ.17-18 వేల కోట్లు కావాల్సి వస్తోంది. ఇలా ఏ నెల సొమ్ము ఆ నెలలోనే కరిగిపోతుండడంతో కొన్ని పథకాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
భూముల అమ్మకం
ఖజానాలో పైసలు లేకపోవడంతో భూముల అమ్మకాన్ని వేగవంతం చేయాలని సీఎం, హరీష్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక ఇప్పటికే హెచ్‌ఎండీఏ ద్వారా ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ భూవిక్రయాల ద్వారా కనీసం రూ.10 వేల కోట్లను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఔటర్ రింగు రోడ్డులోని టోల్ ప్లాజాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ లీజు వల్ల రూ.3000కోట్ల వరకు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. జీవోలు 58, 59కు సంబంధించి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచడం గమనార్హం. వీటి కింద మరో రూ.1000-1500కోట్ల వరకు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మద్యం అమ్మకాలు పెంచాలట!
ఇవే కాకుండా మద్యం అమ్మకాలు మరింత పెరిగేలా చూడాలంటూ ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం లక్ష్యాలు విధిస్తోంది. ఎన్నికల ఏడాది, అందునా అధికారంలోకి రావాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా రూ.25 వేల కోట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవే కాదు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో దళితబంధు రెండో దశ, ‘గృహ లక్ష్మి’, గొర్రెల పంపిణీ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాలకే అత్యవసరంగా రూ.21వేల కోట్లు కావాల్సి ఉండడం గమనార్హం. మరి వీటిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ ఈ పథకాలకు నిధులు కేటాయించకుంటే సర్కారు పుట్టి మునిగే ప్రమాదముంది.