Homeఆంధ్రప్రదేశ్‌EC Shock To YCP- TDP: వైసీపీ, టీడీపీకి గట్టి షాకిచ్చిన ఈసీ..

EC Shock To YCP- TDP: వైసీపీ, టీడీపీకి గట్టి షాకిచ్చిన ఈసీ..

EC Shock To YCP- TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయినా రాజకీయ పక్షాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్నా దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉన్నట్టు అన్ని రాజకీయ పక్షాలు సంకేతాలు పంపుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నిర్ణయాలు అధికార వైసీపీ, ప్రధాన విపక్షం టీడీపీని డిఫెన్స్ లో పడేశాయి. వైసీపీ ప్రభుత్వ మానస పుత్రిక అయిన వలంటీరు వ్యవస్థపై ఈసీ కొరడా ఝుళిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లకు అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికార పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. మరోవైపు టీడీపీ కూడా ఈసీ షాకిచ్చింది. టీడీపీ ప్రాంతీయ పార్టీయే తప్ప జాతీయ పార్టీ కాదని ప్రకటించింది. జాతీయ పార్టీ హోదా జాబితా నుంచి టీడీపీని తొలగించింది. అయితే ఒకేసారి వైసీపీ, టీడీపీలకు ఈసీ షాకివ్వడం చర్చనీయాంశమైంది.

EC Shock To YCP- TDP
Chandra Babu, Jagan

అధికార పార్టీకి షాక్..

అధికార వైసీపీ ప్లీనరీ విజయవంతం కావడంతో మంచి ఊపు మీద ఉంది. రాష్ట్రంలో 175 స్థానాలు కైవసం చేసుకుంటామన్న దీమా అటు అధినేత జగన్ కనబరుస్తున్నారు. శ్రేణుల్లో ధైర్యం నింపుతున్నారు. పటిష్టమైన పార్టీ సంస్థాగత నిర్మాణం, వలంటీరు వ్యవస్థ విజయానికి దోహదం చేస్తాయని నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో వలంటీర్లే ‘కీ’లకం. వారి కనుసన్నల్లోనే పాలన నడుస్తోంది. సంక్షేమ పథకాల నుంచి పౌరసేవల వరకూ వారి ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. వారి నియామకంపై విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడేళ్లుగా జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి వలంటీర్లే కారణమన్న ఆరోపణలున్నాయి. వలంటీర్లే అధికార పార్టీకి బూత్ ఏజెంట్లుగా ఉండడంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టి, అధికార పార్టీ విజయానికి కారకులవుతున్నారని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వలంటీర్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచాలన్నదే ఈ ఆదేశాల సారాంశం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

మానస పుత్రికగా…

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్లను నియమించారు. ప్రతీ 50 కుటుంబాల బాధ్యతను ఒక వలంటీరుకు అప్పగించారు. రూ.5 వేల గౌరవ వేతనంగా నిర్ణయించారు. ప్రభుత్వం నుంచే జీతాలు అందిస్తున్నారు. ఏడాదిలో సత్కారాల పేరిట కొంతమొత్తాన్ని ముట్టజెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు బాధ్యతను వారికే అప్పగించారు. పింఛన్ల పంపిణీ సైతం వారితో చేయిస్తున్నారు. దీంతో ప్రజలతో వారు నిత్యం మమేకమవుతూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల కంటే వలంటీరే పవర్ ఫుల్ గా మారారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో వలంటీరు వ్యవస్థపై అన్నివర్గాల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. వలంటీరును కలిస్తే పని జరిగిపోతుందన్న నమ్మకం కుదిరింది. అయితే ఈ పరిణామం అధికార పార్టీ వారికి సైతం ఒక్కోసారి మింగుడు పడడం లేదు. ఈ విషయం పక్కనపెడితే వచ్చే ఎన్నికల్లో వలంటీరు వ్యవస్థ ద్వారా గట్టెక్కుదామని అధికార వైసీపీ నేతలు భావించారు. స్థానిక సంస్థల మాదిరిగా విజయం సాధించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు మార్పు, తొలగింపులు వంటివి వారి ద్వారానే చేయిస్తున్నారు. అయితే పడనివారు, విపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించం వంటి చర్యలను వలంటీర్లు ప్రారంభించారు. వీటిని గుర్తించిన విపక్ష నాయకులు ఎలక్షన్ కమిషన్ కు నేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ వలంటీరు వ్యవస్థను అసలు ఎన్నికల ప్రక్రియకు దరి చేరనీయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు వంటి విధుల్లో వలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే ఈ నిర్ణయం అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. విపక్షాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి.

టీడీపీకి పోయిన జాతీయ హోదా..

మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీలను ప్రకటించింది. దేశంలో 27 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్టు తేల్చింది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, నేషనల్ పిపుల్స్ తదితర పార్టీలకు జాతీయ పార్టీల జాబితాలో చోటు దక్కింది. అయితే ఇన్నాళ్లూ టీడీపీ జాతీయ పార్టీ జాబితాలో ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగేది. జాతీయ పార్టీగా చెప్పుకునేది. అందుకే చంద్రబాబు జాతీయ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షులను నియమించేవారు. కానీ నిబంధనల ప్రకారం తెలంగాణాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసీ జాతీయ హోదాను రద్దు చేసింది. అయితే వలంటీరు వ్యవస్థపై ఆంక్షలతో టీడీపీలో ఆనందం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ట్విట్ చేసే వరకూ విషయం బయటకు రాలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version