AP Liquor Policy : ఏపీలో మళ్లీ ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవనున్నాయా? ప్రభుత్వ మద్యం పాలసీతో ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదా? ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు దుకాణాల వైపు మొగ్గుచూపుతుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు నిజం చేకూరుస్తున్నారు. కొద్దిరోజుల్లో మద్యం పాలసీలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఇదే చర్చకు వచ్చింది. ఆదాయం పెరగాలంటే ప్రైవేటు విధానమే మేలంటూ కొందరు అధికారులు సలహా ఇవ్వడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం చివరకు ప్రైవేటుకే మొగ్గు చూపింది. తద్వారా మద్య నిషేధం అన్న మాట మరిచి ఆదాయమే పరమావధిగా ముందుకు సాగుతున్నట్టు తేటతెల్లమైంది. వైసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధిస్తామని నాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఊరూ వాడా తిరిగి చెప్పారు. అసలు బెల్టు దుకాణమంటూ లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మద్యం బాధిత కుటుంబాలు వైసీపీ పక్షాన నిలిచాయి. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ మడత పేచీ వేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు మద్య నిషేధం సాధ్యమయ్యే పనికాదని తేల్చిచెప్పారు. నాలుగేళ్లలో మద్య నిషేధం వైపు అడుగులేస్తామని చెప్పారు. కొత్త మద్యం పాలసీని ప్రకటించారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఏడాదికి 25 శాతం షాపులు తగ్గిస్తామని ప్రకటించారు. కానీ ఇది తొలి ఏడాదికే పరిమితమైంది. గత రెండేళ్లలో మద్యం దుకాణాలు తగ్గకపోగా.. పర్యాటక ప్రాంతాలు, నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో ‘బార్లు’ తెరిచారు. మద్యం ధరలను అమాంతం పెంచేశారు. అయితే మందు బాబులను మద్యం నుంచి దూరం చేసేందుకేనంటూ వక్రభాష్యం చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆదాయం పెంచుకునేందుకు మళ్లీ ప్రైవేటుకు ద్వారాలు తెరుస్తున్నారు.

-మరింత ఆదాయం కోసం..
గతంతో పోలిస్తే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. అయితే రాష్ట్రంలో మద్యానికి ఉన్న డిమాండ్ మేరకు అమ్మకాలు పెరగడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. నాసిరకం బ్రాండ్లు, అధిక ధరలు కావడంతో మందుబాబులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. పక్కనే ఉన్న ఒడిశా, తెలంగాణా నుంచి మద్యం దిగుమతి అవుతోంది. అక్కడ నచ్చిన బ్రాండ్లు, పేరుమోసిన బ్రాండ్లు లభించడంతో అక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇలా మద్యం వినియోగమైతే పెరుగుతోంది తప్ప ఏపీ ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరడం లేదు. దీనికితోడు రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడే లభ్యమవుతోంది. అటు ఎస్ఈబీ, ఇటు పోలీసులు దాడులు చేస్తున్నా నియంత్రణలోకి రావడం లేదు. తక్కువ ధరకు సారా లభిస్తుండడంతో మందుబాబులు అటువైపే మొగ్గుచూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది.
-ప్రైవేటుకు అప్పగిస్తే…
గత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూరింది. రూ.25 వేల కోట్లు అమ్మకాలు జరగగా.. నిర్వహణ ఖర్చు కింద రూ.5 వేల కోట్లు ఖర్చయ్యాయి. మిగతా రూ.20 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. ఈ లెక్కన నెలకు రూ.1900 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ ఆదాయంతో ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే నెలకు రూ.3 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మద్యం వ్యాపారం విస్తరిస్తే ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే వారే లక్ష్యాన్ని పూర్తిచేస్తారని భావిస్తోంది. వారు అమ్మకాల ద్వారా కమీషన్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని..వివిధ మార్గాలను అన్వేషిస్తారని అభిప్రాయపడుతోంది. కూలింగ్ బీర్లతో పాటు అన్నివసతులు, ఆహార పదార్థాలతో పర్మిట్ రూమ్ లు అందుబాటులోకి తెస్తారని భావిస్తోంది. అందుకే ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తే ఏడాదికి మరో రూ.15 వేల కోట్లు అదనంగా ఆదాయం సమకూర్చుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఒకటి రెండు రోజుల్లో ప్రైవేటు మద్యం విధానంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది.
-ఆది నుంచీ అనాలోచితమే..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం ప్రైవేటుకు మద్యం అప్పగిస్తే మాత్రం విమర్శలు చుట్టుముట్టే అవకాశముంది. మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం ఆది నుంచి అనాలోచితంగా నిర్ణయాలతోనే ముందుకు సాగుతోంది. తొలుత సంపూర్ణ మద్యం నిషేధాన్ని మరిచి ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాల నిర్వహణకు ముందుకొచ్చింది. ఇదేం పని అని విపక్షాలు విమర్శించినా.. నాలుగేళ్లలో మద్యం నిషేధం కోసమే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పింది. నాసిరకం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చి… మద్యం ధరలను అమాంతం పెంచింది. ఇదేమని ప్రశ్నిస్తే మందుబాబులను మద్యానికి దూరం చేయడానికేనంటూ చెప్పుకొచ్చింది. తొలి ఏడాది మాత్రం 25 శాతం లెక్కలు కట్టి కొన్ని షాపులను మూయించింది. అదే సమయంలో అవుట్ లెట్ లు, బార్ల పేరిట వాటి సంఖ్యను పెంచింది. ఇటీవల బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు షాపులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.