
దేశవ్యాప్తంగా భూమి కంపించింది. మన భారతదేశ ఫలకం.. చైనా సహా ఉత్తర ఆసియా ఫలకంతో ఢీకొట్టడం వల్లే ఈ భూ ప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు కొన్ని రోజుల క్రితం కనిపెట్టారు. అంతేకాదు.. ఇలా ఢీకొట్టడం వల్లే హిమాలయాలు అంత పెద్దగా ఏర్పాడ్డాయని నిర్ధారించారు.
మరి దేశమంతా భూప్రకంపనలు వచ్చి తెలంగాణలో ఎందుకు రాలేదన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. తాజాగా తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా భూకంపం వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో భూమి కంపించింది. . కొన్ని సెకండ్లపాటు ఒంగోలులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు తెలిపారు. భూకంపం వచ్చిందేమోనని ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఒంగోలులోని గద్దలకొండ, మామిడి పాలెం, దేవుడు చెరువు, శర్మ కాలేజీ, అంబేద్కర్ నగర్ పరిసరాల్లో ఈ భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం 10.15 గంటలకు స్వల్పంగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
శుక్రవారం ఉదయం ఏపీతోపాటు కర్ణాటక, ఝార్ఖండ్ లో భూ ప్రకంపనలు సంభవించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 4.7గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇక కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఎలాంటి నష్టం ఈ రాష్ట్రాల్లో లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే పక్కనున్న ఏపీలో భూమి కంపించింది.. దేశమంతా భూమి ప్రకంపనలు వచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం భూ ప్రకంపనలు పెద్దగా రావని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. దీనికి కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక దక్కన్ పీఠభూమిగా ఉండడమే. అంటే ఒక పెద్ద శిలాజంగా తెలంగాణ రాష్ట్రం కింద పలకలున్నాయట.. అంటే మరీ అర్థమయ్యేలా చెప్పాలంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం.. లావాలతోనే లేక గుట్టలతోనే తెలంగాణ రాష్ట్రం కింద ప్రాంతంలో బండరాయిలు విస్తరించాయి. అది అలా బలంగా ఉండడంతోనే తెలంగాణ భూకంపాలు, ప్రకంపనలు ఉండవన్నది శాస్త్రవేత్తల మాట. ఈ ప్రాంతం భౌగోళికంగా ప్రపంచంలోనే నిలకడ కలిగి, అధిక ద్రవ్యరాశి గలది. అనేక పెద్ద నదులను కలిగివున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.
తెలంగాణ రాష్ట్రం భూకంప రహితమైన రాష్ట్రమని తెలుసు కాబట్టే ప్రపంచప్రఖ్యాత గూగుల్, అమేజాన్ సహా కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని.. ఇప్పటికే చాలా సంస్థలు తమ విభాగాలు నెలకొల్పాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలా భూకంప రహిత ప్రాంతంగా తెలంగాణ ఉంది. దక్కన్ పీఠభూమి తెలంగాణను కాపాడుతోందని చెబుతున్నారు..
-నరేశ్ ఎన్నం