Earning Money Scams : పశువుల దాణా కుంభకోణం తర్వాత.. చాలా స్కాం లు వెలుగులోకి వచ్చాయి. కాకపోతే రాజకీయ నాయకులు, అధికారులు నొక్కిన నగదు స్థాయి దాటిపోతున్నది. పదులు, వందలు దాటి వేలకోట్లకు చేరిపోతున్నది. అయినప్పటికీ మన వ్యవస్థల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యం వల్ల దొంగలందరూ దర్జాగా తిరుగుతున్నారు. ఏదో కొద్ది రోజులపాటు జైల్లో ఉంటూ ఆ తర్వాత తన పలుకుబడితో బయటికి వస్తున్నారు. డబ్బు బలంతో.. అధికారం మదంతో మళ్లీ జనంలోకి వచ్చి.. ప్రజాసేవ చేస్తున్నట్టు గొప్పలు పోతున్నారు. ఇటువంటి వారే మళ్లీ చట్టసభలకు ఎన్నికవుతూ.. వారే చట్టాలు రూపకల్పన చేస్తున్నారు. బహుశా ఇలాంటి దరిద్రం మనదేశంలో తప్ప.. ఇంకెక్కడా ఉండదనుకుంటా. ఇక ప్రభుత్వంలో ఉన్న పెద్దల సంగతి కాస్త పక్కన పెడితే.. ప్రభుత్వానికి కీలక ఇరుసు లాంటి అధికారులు తామేం తక్కువ అన్నట్టుగా అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో అడ్డగోలుగా దోచుకోవడానికి అధికారులు చివరికి పాములను కూడా వదిలిపెట్టలేదు.
సాధారణంగా పాములకు విషం ఒక స్థాయి వరకే ఉంటుంది. కానీ అవినీతికి పాల్పడిన అధికారులు విష సర్పాలను కూడా వదలలేదు.. తమ అవినీతికి.. అడ్డగోలు సంపాదనకు పాములనే వారు ఆలవాలంగా మార్చుకున్నారు. దీనికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకి రావడంతో.. మధ్యప్రదేశ్ అధికారుల అవినీతి బాగోతం బయటపడింది.
పూర్తి అడవి రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో పాముకాటుతో మరణిస్తే అక్కడి ప్రభుత్వం నాలుగు లక్షల చొప్పున పరిహారం ఇస్తుంది. అయితే దీనిని అదునుగా తీసుకున్న రెవెన్యూ అధికారులు సీయోని అనే ప్రాంతంలో 47 మంది పాముకాటుతో మరణిస్తే.. ఏకంగా 280 మంది పాముకాటుతో చనిపోయారని రికార్డులలో నమోదు చేశారు. అప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలు సృష్టించారు. తమకు అనుకూలమైన వ్యక్తుల ఖాతాలలో నగదు వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. ఇలా 11.26 కోట్లు నొక్కేశారు.. అయితే రెవెన్యూ అండ్ అకౌంట్ దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ఈ వ్యవహారంలో 37 మందికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో 20 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా 17 మంది పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరి వెనక రాజకీయ నాయకులు కూడా ఉన్నట్టు సమాచారం. వారందరినీ కూడా కటకటాల వెనక్కి పంపించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీరు నొక్కేసిన 11.26 కోట్లను రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..” ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాలని పరిహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కానీ కొంతమంది వల్ల అది దారితప్పింది. దాదాపు 11.26 కోట్ల నగదు అనర్హుల ఖాతాల్లోకి వెళ్లిందంటే.. పథకం లక్ష్యం మొత్తం దారితప్పిందని అర్థమవుతోంది. సీయోని మాత్రమే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఆడిట్ నిర్వహించి.. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని” ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.