మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మద్దతు పలికారు. రాజకీయ ప్రస్థానంలో ఈటల వెంట ఉంటానని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈటల బలం పెరిగుతుందని భావిస్తున్నారు. అసంతృప్తులందరూ ఈటలను కలుస్తారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ముసలం ప్రారంభమైందని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకునే విధంగా పావులు కదుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రవీందర్ రెడ్డి బాటలోనే..
టీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేతలు రవీందర్ రెడ్డి బాటలో పయనిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టాలనే ఆశయానికి ఊతం పడినట్లే. టీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మందే ఈటలను కలుస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ పై అక్కసుతోనే పార్టీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ కు పతనం మొదలైందని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.
పదవులు తక్కకపోవడంతో..
టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది పదవులు దక్కని వారు ఉన్నారు. వారంతా పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. జిల్లా టీఆర్ఎస్ నాయకులు నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీకి దూరం అయ్యేందుకే ముందుకు వస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా తగిన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీని వీడేందుకు సుముఖంగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడని వారికి సైతం పలు రంగాల్లో ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కోసం కష్టపడిన వారినే విస్మరిస్తున్నారని వాపోతున్నారు. దీంతో రవీందర్ రెడ్డి తో పాటే నడిచేందుకు పలువురు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సమాయత్తం అవుతున్నారు.
మారుతున్న పరిస్థితులు
రోజురోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీ వీడేందుకే పలువురు నాయకులు నిర్ణయించుకోవడంతో వారిని బుజ్జగించేందుకు సైతం పార్టీనాయకులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. అలక బూనిన వారిని అక్కున చేర్చుకుని త్వరలో మీకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. పదవులు ఎరగా వేస్తూ పార్టీ వీడకుండా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.