
Hyderabad: ఇదీ.. పండగంటే.. రెండున్నరేళ్లుగా కరోనా కారణంగా సగం సగం ఎంజాయ్ చేసిన ప్రజలు ఈ దసరాను ఫుల్ జోష్ తో జరుపుకున్నారు. పండగంటే ఇలా ఉండాలనే కోణంలో కిక్కెక్కించారు… ముక్కకు ముక్క.. సుక్కకు సుక్క లాగించేశారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ నగర వాసులు ఈసారి చాలా సంతోషంగా దసరా వేడుకను జరుపుకున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో మద్యం.. మాంసం అమ్మకాలు జరిగాయి. రెండేళ్లుగా కరోనాతో కిక్కుకు దూరమైన ప్రజలు ఈసారి మద్యం.. మాంసంతో పసందైన విందు చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో చికెన్ మటన్ అమ్మకాలు జోరుగా సాగగా.. అంతకన్న ఎక్కువ మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో జరిగాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.222 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అదే విధంగా మంగళ, బుధ, గురువారాల్లో 75కోట్ల అమ్మకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా హైదరాబాద్ పట్టణ పరిధిలో రోజుకు 10లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే గురు, శుక్రవారాల్లో ఈ అమ్మకాలు 50లక్షల కిలోలకు దాటిపోయాయి. కిలో మటన్ ధర రూ.700 నుంచి రూ.800 పలకగా.. చికెన్ రూ.200 నుంచి 250 మధ్య లభించింది. దీంతో పట్టణ ప్రజలు పండగ చేసుకున్నారు.
సాధారణంగా దసరా.. సంక్రాంతికి ఎక్కువగా తెలుగు ప్రజలు మటన్ కు ప్రిపరెన్స్ ఇస్తుంటారు. అయితే ఈసారి హైదరాబాద్ వాసులు రొటీన్ కు భిన్నంగా చికెన్ కే ఓటేశారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ప్రతీ రూపాయి పొదుపుగా వాడాల్సిన పరిస్థితి. అందులోనూ మటన్ ధర కొండెక్కి కూర్చుంది. రూ.వెయ్యి పెట్టి కిలో మటన్ తీసుకొచ్చినా.. నలుగురు కలిసి కడుపునిండా తినలేని పరిస్థితి. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులు ఎక్కువగా చికెన్ కు ఓటేశారు. ధర తక్కువగా ఉండడం రూ.200 పెడితే కిలో చికెన్ రూ.500 పెడితే పదిమంది వరకు తినేంత వస్తుండడంతో చికెన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ క్రమంలోనే పండక్కి 50లక్షల క్వింటాళ్ల చికెన్ అమ్మకాలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పండగ సందర్భంగా చికెన్ సెంటర్లన్నీ ఉదయాన్నే రద్దీగా కనిపించాయి. చాలా మంది గంటల కొద్ది బారులు తీరారు. మొత్తంగా ఈసారి హైదరాబాదీలు వీరికి ఎంతో ఇష్టమైన చికెన్ తోనే పండగ చేసుకున్నారు.
ఇక మద్యం అమ్మకాలు కూడా ఈసారి రికార్డుస్థాయిలో జరిగాయి. ఈనె 12నుంచి 14వ తేదీ మధ్యంలో అంటే మూడు రోజుల వ్యవధిలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే రూ.222.23 కోట్ల అమ్మకాలు హైదరాబాద్ పరిధిలో జరిగాయి. ఈసారి చాలా మంది లిక్కర్ కన్నా.. బీర్లకే ఆసక్తి ఎక్కువగా చూపారని ఆబ్కారీ శాఖవారు చెబుతున్నారు. రెండేళ్లపాటు కరోనా కారణంగా బీర్ల అమ్మకాలు చాలా వరకు పడిపోయాయని. ప్రస్తుతం దసరా సందర్భంగా అమ్మకాలు జోరుగా సాగాయని అన్నారు. చాలా వైన్స్ ల్లో మధ్యాహ్నానికే స్టాక్ అయిపోయిందని, కూల్ లేని బీర్లను సైతం మద్యం ప్రియులు తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. అయితే కొన్నాళ్లుగా కరోనా కారణంగా బీర్ల అమ్మకాలు పడిపోయా.. రూ.10 ధర తగ్గించాయి కంపెనీలు.. మళ్లీ అమ్మకాలు ఊపందుకోవడంలో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.