Homeజాతీయ వార్తలుCM KCR: పార్టీ జాతీయం.. మాటలు ప్రాంతీయం.. అదిరిందయ్యా కేసీఆర్‌!

CM KCR: పార్టీ జాతీయం.. మాటలు ప్రాంతీయం.. అదిరిందయ్యా కేసీఆర్‌!

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. జాతీయ పార్టీ స్టెప్‌ బూమరాంగ్‌ అయిందని కేసీఆర్‌ చెప్పకనే చెబుతున్నారు. ఇక ప్రాంతీయమే బెటర్‌ అని అనుకుంటున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఎక్కడా జైభారత్‌ అని నినదించడం లేదు.. జై తెలంగాణకే పరిమితమవుతున్నారు. అంతేకాదు.. భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అని ప్రకటించేశారు.

జాతీయ రాజకీయాలకు స్వస్తి..
గతేడాది దసరా సందర్భంగా కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా ప్రకటించారు. ఏడాదిలో పార్టీని విస్తరించేందుకు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు చేపట్టారు. మహారాష్ట్రలో అయితే ఐదారుసార్లు పర్యటించారు. భారీ సభలు కూడా నిర్వహించారు. వందల మందిని పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు అధ్యక్షులను కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు జాతీయ రాజకీయాలకు గులాబీ బాస్‌ స్వస్తి పలికినట్లే కనిపిస్తోంది.

ఢిల్లీ పొమ్మంటరా..
ఆరు నెలల క్రితం వరకు కేసీఆర్‌ ఎక్కడ సభ పెట్టినా ఢిల్లీకి పోవాల్నా.. దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తరహాలో దేశాన్ని మార్చాలి. అందుకే ఢిల్లీ రావాలంటున్నరు.. పోవాల్నా మరి.. మీరు ఆశీర్వదిస్తే పోత’ అని ప్రకటించేవారు. ప్రజలు కూడా పోవాలని నినదించేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్‌ తన గత రాజకీయ అడుగుల గురించి ఎక్కడా ప్రచారం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో జిల్లాల్లో బహిరంగసభలు పెట్టినప్పుడు తాను జాతీయ స్థాయికి వెళ్తున్నానని.. ఢిల్లీని ఢీకొట్టబోతున్నానని మీరంతా అండగా ఉండాలని కోరేవారు. ఇప్పుడు అసలు అలాంటి ప్రకటనలు లేకపోగా.. ప్రాంతీయ పార్టీలే మనకు రక్ష అని చెబుతున్నారు.

ప్రజల్లో అయోమయం..
కేసీఆర్‌ గత మాటలు.. ఇప్పుటి మాటలకు ఫరాక్‌ ఉండడంతో ప్రజల్లోనూ ఆయోమయం ఏర్పడింది. కానీ కేసీఆర్‌ మాత్రం ఆలాంటి ఆలోచన ప్రజలకు రాకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్‌ తెలంగాణ నుంచి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతూండటంతో అసెంబ్లీ ఎన్నికలపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈమేరకు పక్క రాష్ట్రాలపై దృష్టి తగ్గించారు. తన రాజకీయ ఉద్దేశాలకు భిన్నంగా ఇప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. ప్రాంతీయపార్టీలే రక్ష అని.. వాటిదే భవిష్యత్‌ అని చెబుతున్నారు. ఓ రకంగా కేసీఆర్‌ తాను ఇప్పటికీ తెలంగాణ వాదాన్నే వినిపిస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ బలం ఇంత కాలం తెలంగాణ సెంటిమెంట్‌ మాత్రమే. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌ లేకపోతేం బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఎలా ఉంటుందన్నది రాజకీయవర్గాలకూ అంతు చిక్కనిదే. అందుకే తన బలాన్ని కేసీఆర్‌ మళ్లీ ఉపయోగించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular