Janasena: రాయలసీమలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు జనసేన గూటికి చేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరిగెల రాంపుల్లారెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయనతో పాటు సోదరులు సైతం జనసేనలో చేరడం విశేషం. దీంతో రాయలసీమలో సైతం జనసేన లో చేరికలు ప్రారంభమయ్యాయి. చాలామంది కీలక నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జనసేన ప్రాతినిధ్యం ఉండాలని పవన్ భావిస్తున్నారు. ఈ తరుణంలో రాయలసీమ నుంచి చేరికలు ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇరిగెల రాంపుల్లారెడ్డి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండిపోయింది. ఆ సమయంలో రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు పలికారు. 2008లో భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడారు. ఆ సమయంలో చంద్రబాబు పిలుపుమేరకు టిడిపిలో చేరారు రాంపుల్లారెడ్డి. అటు తరువాత భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో.. ఇరిగెల సోదరులు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. అటు తరువాత రాజకీయంగా స్తబ్దతగా ఉండిపోయారు.
గత ఎన్నికల ముంగిట జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థి గంగుల బ్రీజేంద్ర రెడ్డి విజయానికి కృషి చేశారు. కానీ వైసీపీలో ఆశించినంత స్థాయిలో గుర్తింపు లభించకపోవడంతో ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. జనసేనలో చేరడానికి మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆయన సమక్షంలో ఇరిగెల సోదరులు రాంపుల్లారెడ్డి, రామచంద్రారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ వారిని సాదరంగా ఆహ్వానించారు. రాయలసీమలో జనసేన అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వీరి చేరికతో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.